పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారిది మన లోకం కాదు, దైవలోకం. యాకోబు కలలో చూచిన నిచ్చెన మీదిగా స్వర్గానికీ భూమికీ ఎక్కుతూ దిగుతూ వుంటారు. - ఆది 28, 12. వాళ్ళ దేవునికి చెందిన వాళ్ళు నిర్గ 23, 23. సన్మనస్కులతోపాటు పిశాచం కూడ వుంది. నరులను తప్ప పట్టడం దాని పని = జక 3, 1-2.

కాని నూత్నవేదం సన్మనస్కుల స్వభావాన్ని గూర్చి ఇంకా ఎక్కువ విషయాలు చెప్తుంది. వాళ్ళ ఆత్మస్వరూపులు. శరీరబాధ లేనివాళ్ళ ఉత్థాన కాలంలో మనం వారిలాంటి వాళ్ళమౌతాము, అనగా వీళ్ళకులాగ మనకు కూడ ఆకలిదప్పులు, స్త్రీ పురుషుల కలయిక, బిడ్డలను కనడం మొదలైన లక్షణాలు వుండవు - లూకా 20, 36. మత్తయి 18,10 దేవదూతలు స్వర్గంలో సదా దేవుని ముఖాన్ని దర్శిస్తుంటారని చెప్తుంది. అనగా వాళ్ళ నిత్యం దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంటారని భావం, వాళ్ళ ప్రధాన కార్యం ఇదే. వారికి ఆనందం వుంటుంది — లూకా 15,10. వాళ్ళు మన రక్షణరహస్యాలను అర్థం జేసికోగోరుతారు -1 పేత్రు 1,12. వాళ్ళు మనకంటె ఎంతో బలవంతులు. వాళ్ళను చూచి మనం భయపడిపోతాం. వాళ్ళు ఒకప్పుడు దేవునిమీద తిరగబడ్డారు - 2 పేత్రు 24 మికాయేలు పిశాచంతోను దాని దూతలతోను పోరాడి వారినందరిని నరకంలోనికి త్రోసివేసాడు - దర్శ 12, 7-9. ఆనాటినుండి వారికి దేవునితో వైరం. వారికి ఇక పరివర్తనం వుండదు.

దేవదూతలు ఎంతమంది? క్రీస్తు వాళ్ళు 12 దళాలు అని చెప్పాడు - మత్త 26,53. హెబ్రేయుల జాబు వేలకొలది మంది అంటుంది - 12, 22 దర్శన గ్రంథం కోట్ల సంఖ్యలో వున్నారంటుంది. కనుక సన్మనస్కులు ఎంత మందో మనకు రూఢిగా తెలియకపోయినా పెద్ద సంఖ్యలో వున్నారని మాత్రం చెప్పవచ్చు.

2. దూతల దర్శనాలు

దేవుడు నరులకు సహాయం చేయడానికి పంపిన దేవదూతలు ఆ నరులకు కనిపించారు. అబ్రాహాముకి ముగ్గురు దూతలు కనిపించారు. తరువాత వీళ్ళ దేవుడేనని తేలింది - ఆది 18, 2. ఆలాగే ఒక దేవదూత దానియేలుకి దర్శనమిచ్చి అతనికి దర్శనాల భావాన్నితెలియజేసాడు - దాని 8, 15. మనోవా భార్యకు కూడ ఒక దేవదూత కన్పించి సంసోను జనన వృత్తాంతాన్నితెలియజేసాడు– న్యాయాధి 13,6. పూర్వవేదంలోని దేవదూతల కథలు కొన్ని యివి :

1 అబ్రాహాము దూతలకు ఆతిథ్యమీయడం - ఆది 18, 1-10

2. దూతలు లోతుని సౌదొమ వినాశం నుండి కాపాడ్డం - ఆది 19