పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. క్రైస్తవుడు మృత్యువుని గెలుస్తాడు

క్రీను మనకొరకు చనిపోయాడు. కాని అతని మరణం మనకెలా వుపయోగపడుతుంది? తొలి ఆదాములో మనమందరం ఇమిడివున్నట్లే, మలి ఆదామైన క్రీస్తులో కూడ అందరం ఇమిడి వున్నాం -1కొ 15, 45. అతని మరణంలో మనంకూడ మరణించాం. విశేషంగా జ్ఞానస్నానంలో క్రీస్తు మరణం మనమీద సోకుతుంది. మనం అతనితోపాటు చనిపోయి, అతనితోపాటు భూస్థాపితులమౌతాం - రోమా 6, 3-4.కాని ఈ చావు శారీరకమైంది కాదు, ఆధ్యాత్మకమైంది. అనగా మనం జ్ఞాన స్నానంలో చనిపోయేది పాపానికి - 6, 11. ఈ జ్ఞానస్నాన సమయంనుండి క్రీస్తు మరణం మనమీద సోకి మన మరణాన్ని అణచివేస్తుంది. మృత్యుంజయుడైన ప్రభువు మనకు జీవాన్నిస్తాడు. అతని పలుకులు వినేవాడు మరణాన్ని దాటి జీవంలో అడుగిడతాడు - యోహా 5,24. అతన్ని విశ్వసించేవాడు మరణించికూడ మళ్ళా జీవిస్తాడు 11,25. కాని ప్రభువుని అంగీకరింపనివాడు రెండవ మరణానికి గురౌతాడు - దర్శ 2, 11.

ఐతే మనం పాపానికి చనిపోవడమనేది జ్ఞానస్నాన స్వీకరణం తర్వాతకూడ కొనసాగాలి. క్రైస్తవుడు తనలోని పాపపు మానవుణ్ణి నిరంతరం చంపుకొంటుండాలి - రోమా 8,13 పౌలులాగ మనంకూడ రోజురోజు చనిపోతుండాలి - 1 కొరి 15,31 రోజురోజు క్రీస్తు మరణాన్ని అనుభవించేవాడు అతని జీవాన్ని కూడ పొందుతాడు. పౌలు ప్రేషిత సేవలో దినదినం మరణిస్తుండగా అతనివలన విశ్వాసులకు జీవం లభిస్తుండేది - 2 కొరి 4,12.మన జీవితంకూడ ఈలాగే వండాలి.

ఇక మన శారీరకమైన మరణం విషయమేమిటి? మనం క్రీస్తుకొరకే జీవించాలి.క్రీస్తుకొరకే మరణించాలి. మన మరణం అతని మరణంతో కలిసిపోవాలి - రోమా 14, 7-8. కొందరు క్రీస్తకి సాక్షులుగా, అనగా వేదసాక్షులుగా మరణిస్తారు. వారికి జీవకిరీటం లభిస్తుంది - దర్శ 2, 10. ప్రభువునందు మరణించేవాళ్ళ ధన్యులు. అన్ని శ్రమల నుండి వారికి విశ్రాంతి లభిస్తుంది -14, 13. మన తరపున మనం ప్రతిరోజు మన మరణాన్నిక్రీస్తు మరణంతో జోడించాలి. నీతిమంతులు మరణంద్వారా నిత్యశాంతిలోనికి, నిత్యప్రకాశంలోనికి ప్రవేశిస్తారు - జ్ఞాన 3,3.

పూర్వవేద ప్రజలు ఉత్థానంకొరకూ అమరత్వం కొరకూ ఎదురుచూచారు. ఈ నిరీక్షణం క్రీస్తద్వారా నెరవేరింది. అతనికి ఉత్థానాన్ని దయచేసిన తండ్రి అతనిద్వారానే మనకుకూడ ఉత్థానాన్ని ప్రసాదిస్తాడు - రోమా 8,11. ఆ వుత్తాన జీవితంలో మృత్యువు వుండనే వుండదు - దర్శ.214 మరణానికీ పిశాచానికీ దుషులకూ మాత్రమే రెండవ మరణం వుంటుంది –21,8.