పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగించవచ్చు సౌలురాజు పొలం దున్నుకొని తిరిగి వస్తూ అమ్మోనీయుల దౌర్జన్యానికి కోపించి వారిమీదికి యుద్దానికి పోయాడు -1సమూ 11:5. గొర్రెల కాచుకొనే దావీదు కూడ రాజుగా ఎన్నికయ్యాడు. అనగా ఏపనీ నీచమైంది కాదని బైబులు అభిప్రాయం. అందుకే యాదరబ్బయులు చిన్నచిన్న వృత్తులు చేపట్టారు. ప్రతిరబ్బయి ఏదో వొక వృత్తి ద్వారా పొట్టబోసికోవాలని నియమంచేసారు.

దేవుని దయవల్ల నరుడు తన కష్టర్జితాన్ని తాను అనుభవిస్తాడు. ఆనందాన్నీ అభ్యుదయాన్ని పొందుతాడు - కీర్త 128:2. తాను పండించిన పంటను తానే భుజిస్తాడు. తాను పండించిన ద్రాక్షపండ్లరసాన్ని తానే పానం చేస్తాడు - యెష 62:8-9. దేవుని కృపకు నోచుకోనివారికి ఈ భాగ్యాలు లేవు. వారి కృషి రాణించదు.

బైబులు భావాల ప్రకారం నరుని కార్యాలు రెండు. సంతానాన్ని కనడం, శ్రమ చేయడం. దేవుడు తొలి దంపతుల్ని సంతానాన్ని కని లోకమంతట వ్యాపించమని ఆజ్ఞాపించాడు - ఆది 1:28. మొదటలో భూమి మీద జనసంఖ్య పెద్దగా లేదు. కనుక అబ్రాహాము, ఈసాకు, యాకోబు మొదలైన పితరులు జనాభాను పెంచడమే ముఖ్యమని భావించారు. సంతానం దేవుని పోలిక కల పవిత్రప్రజ అని యెంచారు. ఈ సంతానం నుండే తర్వాత మెస్సీయా ఉద్భవించి సకల జాతులను దీవిస్తాడు. ఇక, నరుడు శ్రమచేసి భూమిని సేద్యం చేయాలి. అది తొలి నరుని పాపం వలన శాపగ్రస్తమైంది. ఐనా నరుని కృషి వలన మల్లా ఫలిస్తుంది. నరుణ్ణీ పోషిస్తుంది.

ఐతే నరుడు చేసే పనులన్నిటిలోను దైవారాధనం ఉత్తమమైంది. కనుక అతడు దేవుణ్ణి పూర్ణమనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ప్రేమించాలి - ద్వితీ 6:5. సొలోమోను దైవారాధనకు దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమమైన కార్యం.

ఇంకా యూదభక్తులు కరుణ కార్యాలు, పుణ్యకార్యాలు చేయాలని ఆజ్ఞాపించారు. పేదలకు దానధర్మాలు చేయడం, మృతులను భూస్థాపనం చేయడం, వ్యాధి గ్రస్తులను సందర్శించడం, ప్రార్థన ఉపవాసాలు చేయడం మొదలైనవి ఈ సత్కార్యాలు. ఐతే కొందరు ఈ సత్కార్యాల వల్లనే మోక్షాన్ని పొందుతామని వాదించారు. నూత్న వేదంలో క్రీస్తు ఈ భావాన్ని నిరసించాడు. స్వర్గం దేవుడు మనకు ఉచితంగా దయచేసేది గాని మనపణ్యకార్యాల వల్ల కొనుక్కొనేది కాదు. మన పుణ్యక్రియలు దేవుడు మనకు దయ చేసిన భాగ్యాలకు వందనాలు చెప్పకోవడానికి మాత్రమే వుపయోగపడతాయి. కనుక నరులు మేము ఇంత