పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వవేదం పాపం వలన పని భారంగా మారిపోయిందని మాత్రమే చెప్పదు. పనిని గూర్చి ఇంకా చాలవిషయాలు చెప్పంది. ప్రస్తుతానికి కొన్ని అంశాలను మాత్రం పరిశీలిద్దాం.

పూర్వవేదంలో విశ్రాంతిని తీసికొమ్మనే దైవాజ్ఞ వుంది - నిర్గ 20:10. కాని పనిచేయమని చెప్పే దైవాజ్ఞయేదీ ధర్మశాస్త్రంలోని 613 ఆజ్ఞల్లోను లేదు. ఎందుకు? నరుడు సహజంగా పని చేయాలి, దానిని గూర్చి దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞ ఈయనక్కరలేదు.

శ్రమించి పని చేయడానికి భిన్నమైన గుణం సోమరితనం. కనుక జ్ఞానులు సోమరితనాన్ని చాలతావుల్లో ఖండించారు. సోమరి తిండి దొరక్క చస్తాడు - సామె 13:4. సోమరి కోరికలే వానిని చంపివేస్తాయి. వాడు కష్టించి పనిచేయడానికి అంగీకరించడు - 21:25. ఇంకా బద్ధకస్తుడు చీమలను చూచి బుద్ధి తెచ్చుకోవాలి. పని చేయనివారికి ఈ చీమల ఉపమానం ప్రబోధం కలిగిస్తుంది.

సోమరీ! చీమలను చూడు
వాటి జీవితాన్ని చూచి బుద్ధితెచ్చుకో
వాటికి నాయకుడు లేడు,
పర్యవేక్షకుడు అధికారి లేడు
ఐనా అవి వేసవిలో ఆహారం చేకూర్చుకొంటాయి
కోతకాలంలో ధాన్యాన్ని సేకరించుకొంటాయి
సోమరీ! నీవెంత కాలం పండుకొంటావు?
ఎప్పుడు నిద్ర మేల్కొంటావు? - 6:6 -9.

దీనికి భిన్నంగా ఆదర్శగృహిణి చక్కగా పనిచేస్తుంది. సోమరితనానికి ఏమాత్రం లొంగక కుటుంబ పరిస్థితుల్ని మెలకువతో చక్కదిద్దుకొంటుంది -31:27. కాని అలసుని విషయమేమిటి?

తలుపు బిందు మీద తిరిగినట్లే
సోమరిపోతు పడక మీద దొర్లుతాడు
సోమరి కంచంలో చేయి పెడతాడు గాని

అన్నమెత్తి నోట పెట్టుకోవడం కష్టమనుకొంటాడు 26:14.15. ఈ వాక్యాల్లో బోలెడంత హాస్యముంది.

ఐతే బైబులు చక్కగా చేసిన పనిని మెచ్చుకొంటుంది. రైతు బాగా పొలం దున్నే తీరునీ, కుమ్మరి చక్కగా కుండలు చేసే రీతినీ ప్రశంసిస్తుంది.