పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదాముకి వచ్చిన తిప్పలు ఇవి. భూమి శాపం పాలయింది. అది పంటలు పండక ముండ్ల తుప్పలతో నిండిపోయింది. ఆదాము చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకోవాలి. మట్టినుండి పట్టిన నరుడు మట్టిలోనే కలసిపోవాలి - ఆది 3:17-19. ఏవకు కలిగిన బాధలు ఇవి. ఆమె ప్రసవవేదన అనుభవించి బిడ్డలను కనాలి. పురుషుడి పెత్తనానికి లొంగిపోవాలి -3:16. కాని శాపంవలన వచ్చిన ప్రధాన శిక్ష మరణం. అంతవరకు చావలేక అమరులుగా వుండిపోయిన నరులు ఇప్పుడు చావువాత పడ్డారు. ఈ చావువల్ల మన ప్రణాళికలూ మనం సాధించిన కార్యాలూ మన విజయాలూ నాశమైపోతాయి. మన పనులు ఏవీ శాశ్వతంగా నిలువవు. ఈ యంశం మనకు బాధను కలిగిస్తుంది.

పాపఫలితంగా నరుల్లో అన్యాయం, దురాశ, ద్వేషం, అసూయ, హింస పెరిగిపోయాయి. కయీను తన తమ్ముడైన హేబెలుని హత్య చేసాడు - అది 4:8. కయూను పాపంవల్ల నేల పంటల పండకుండ పోయింది - 4:12. ఇంకా చాల దుష్పరిణామాలు సిద్ధించాయి. యజమానులు పనివారికి కూలి చెల్లించక అన్యాయం చేసారు - యాకో 5:4. ధనికులు పేదలను మోసం చేసారు — ఆమో 5:11. శత్రురాజులు తమకు ఓడిపోయిన వారిని బానిసలను చేసారు. యజమానులు బానిసలను పీడించి వెట్టిచాకిరి చేయించారు. ఈజిప్టు ప్రభువులు యిస్రాయేలీయులు బానిసలను చేసి వారిని ముప్పతిప్పలు పెట్టారు. లోకం అన్యాయంతోను, దుఃఖంతోను కూడిన చాకిరితో నిండిపోయింది. పాపానికి పూర్వం పనివేరు, పాపం తర్వాత పనివేరు.

హేబెలు నెత్తురు (ప్రాణం) కయీనుపై పగతీర్చుకొమ్మని దేవునికి మొరపెట్టింది -ఆది 4:10. నరులపని ఈలా అన్యాయానికీ దుఃఖానికీ నిలయమైంది. ఇంకా జనులు దేవునిమీద ఎదురు తిరిగారు. అతడు విధించిన పనిని తప్పించుకోజూచారు. పనిని మానివేసి హాయిగా తిరుగుదామనుకొన్నారు. శ్రమ చేయడం వారికి అనిష్టమైంది. కాని అనిష్టంగా వున్నా కష్టంగా వున్నా దేవుడు వారిని వదలిపెట్టలేదు. నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకోవడం అందరికీ తప్పనిసరి ఐంది. వారంలో ఆరురోజులు పని చేయాలనే దైవాజ్ఞను ఏ నరుడూ తప్పించుకోలేకపోయాడు - నిర్గ 20:9. నేడు మనం పనిని తప్పించుకో జూస్తాం. కాని తప్పించుకొలేం. శ్రమ అనేది దైవ శాసనం, కనుక కష్టంగావున్నా శ్రమ చేయవలసిందే.