పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10.పని

బైబులు భాష్యం - 135

బైబుల్లో పనిని గూర్చి మూడు ప్రధాన భావాలు వున్నాయి. తొలిపాపానికి ముందు నరులకు పని బాధ అనిపించలేదు. తొలిపాపం తర్వాత అది బాధను కలిగించింది. ఇప్పుడు క్రీస్తు మరణోత్థానాల ద్వారా మనపని మనలను రక్షిస్తుంది. ఈ మూడంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. తొలిపాపానికి ముందు పని బాధను కలిగించలేదు

తొలిపాపానికి ముందే పని వుంది. ఐనా అది ఆదాముకి బాధను కలిగించలేదు, భగవంతుడు సృజించిన ఆదాము వట్టినే కాలిమీద కాలు వేసికొని కూర్చోలేదు. దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదెను తోటను సాగుచేయడానికి కాయడానికి దానిలో వుంచాడు - ఆది 2,15. ఇంకా యావే ఆదిదంపతులతో మీరు బిడ్డలను పెక్కుమందిని కనండి. భూమండలం అంతట వసించి దాన్ని వశంజేసికొనండి అని చెప్పాడు – 1,28. కనుక ఆదాము తొలిపాపానికి ముందే పనిచేసాడు. ఏదెను తోటను సాగుచేసాడు. భూమిని వతంజేసికొని దానినుండి ఫలసాయం పొందాడు. ఐనా ఈ పని అతనికి కష్టమనిపించలేదు. సంతోషంగానే వుంది.

ఒక్క ఆదామేకాక అతన్ని సృజించిన భగవంతుడు కూడ పనిచేసాడు. పూర్వవేదంలో యావే చేసిన ప్రధానమైన పనులు రెండు. మొదటిది జగత్తుని సృజించడం, రెండవది యిప్రాయేలీయులను ఫరో దాస్యం నుండి విడిపించడం, మొదట లోక సృష్టిని పరిశీలిద్దాం.

"ప్రభువు తన పలుకుతో ఆకాశాన్ని సృజించాడు
తన శ్వాసతో సూర్యచంద్ర నక్షత్రాదులను చేసాడు" అంటుంది కీర్తన 33,6.
ఇంకా, అతడు అఙ్ఞ యీయగా ఆకాశమూ దాని పైనున్న జల సముదాయమూ పట్టాయి - 148,5.

ఆకాశం దేవుని మహిమను చాటుతుంది
అంతరిక్షం ప్రభువు సృష్టిని వెల్లడి చేస్తుంది 19, 1.
జ్ఞాన గ్రంథాల్లో జ్ఞానమనే మరోశక్తి కన్పిస్తుంది. అనాది కాలంనుండి ఈ శక్తి దేవునితో వుంది. ఈ శక్తి మహా శిల్పి దీని ద్వారానే దేవుడు సృష్టిచేసాడు.