పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీనులూ ఐనా వారికి పంచిపెట్టాలని ఏనాడు అనుకోం. ఈ దేశంలో కటిక పేదలు చాలమందివున్నారు. సంపన్నులయినవాళ్ళు ఒక్క పేద కుటుంబాన్నయినా పట్టించుకొని వృద్ధిలోకి తీసికొనివస్తే ఎంత బాగుంటుంది! దేవుడు మననుండి ఆరాధనకంటె కరుణను అధికంగా కోరుతాడు. తన్నుపూజించడంకంటె అక్కరలో వున్న తోడి నరుణ్ణి ఆదుకోవడం ముఖ్యమని చెప్తాడు. కనుక వేదబోధలో మనం ఉన్నవాళ్ళ లేనివాళ్ళకు సహాయం చేయాలని నొక్కిచెప్పాలి. ఆధునిక ప్రపంచంలో దీనజనోద్ధరణలాగ మరేదీ నరుల హృదయాలను కదిలించదు. కనుక నేడు తిరుసభ వ్యాప్తిలోకి రావాలంటే దిక్కులేని వారిని పట్టించుకోవడం దాని ముఖ్య కార్యమైయుండాలి. ఈ యంశాన్ని మన బోధలో గొంతెత్తి చాటాలి.

14. మన ఆంధ్రరాష్ట్రాన్నే తీసికొంటే, 16వ శతాబ్దంనుండి విదేశ గురువులు ఇక్కడ వేదబోధ చేస్తూవచ్చారు. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో అంతగా కాకపోయినా, ఇక్కడ కూడ ఒక పాటిగానైనా క్రైస్తవమతం రూపుదిద్దుకొంది, భారతదేశంలో నేటికీ మన రాష్ట్రం వేదబోధక రాష్ట్రంగా చలామణి ఔతుంది. నేడు మన స్థానిక గురువులు, మఠకన్యలు, ఉపదేశులు పట్టుదలతో వేదబోధ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశేలో ఏటేట భక్తులు నూత్నంగా క్రైస్తవమతాన్ని స్వీకరిస్తూనే వున్నారు. ఈ యంశాలన్నీ మనకు ప్రేరణం పట్టించాలి. మనం భక్తిశ్రద్ధలుకల ప్రాచీన వేదబోధకులకు వారసులం. ఆ ప్రాచీన భక్తులవలె నేడు మనంకూడ విశ్వాసజ్యోతిని వెలిగించుకొంటూ పోవాలి. కనుక నేడు మనం వేదబోధలో ఏ మాత్రం వెనుకంజ వేయకూడదు. ఈ భాగ్యం కొరకు అందరమూ దేవుని ప్రార్థిద్దాం.