పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. వేదబోధలో మన దేశీయ సమస్యలు కూడ రావాలి. మన ప్రజలు సులువుగా గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. పిల్లలను కని పెంచగలిగిన ధనికులే ఈ పాపానికి ఎక్కువగా ఒడిగడుతున్నారు. ప్రాణాన్ని నాశంజేసే హక్కుఎవరికీ లేదు. ప్రాణాలు పోసేవాడు తీసేవాడు భగవంతుడు మాత్రమే. కనుక మన బోధలో గర్భస్రావం పనికిరాదని ఖండితంగా తెలియజెప్పాలి.

8. మన వుద్యోగులు చీటికిమాటికి లంచం తీసికొంటారు, ఇడి వట్టి అవినీతి. ఈ యవినీతికి పాల్పడవద్దని మన శ్రోతలను హెచ్చరించాలి.

9. నేటి ప్రజలు వట్టి భోగప్రియలు. తినడం, త్రాగడం, సుఖించడం ఇవే ముఖ్యమనుకొంటుంటారు. ఆధ్యాత్మిక విలువలను పట్టించుకోరు. ఐనా ప్రాచీన భారతదేశం పారమార్థిక విలువలకు పెట్టిందిపేరు. కనుక మన బోధల్లో ఈ భోగవాదాన్ని ఖండించాలి.

10. నేడు అన్యమతాలవారితో సంప్రతింపులు జరపడం, వారి మతాల్లోని విలువలను గుర్తించడం కూడ ముఖ్యం. కనుక అన్యమతాలనుగూర్చి చులకనగా మాట్లాడకూడదు. పరమతనిందకు పూనుకోకూడదు. లోకంలో అనేక మతాలు వుండడం గూడ దేవుని చిత్తమే. ఈ మతాల్లోని మంచి అంశాలను స్వీకరించడానికి మనం సిద్ధంగా వండాలి. అన్యమతాల పవిత్రగ్రంథాలను గౌరవంతో చూడాలి. వాటినుండి కూడ సూక్తులను ఉదాహరించాలి. తరచుగా హిందువలు చూపినంత మతసహనాన్ని క్రైస్తవులమైన మనం చూపనందుకు సిగ్గుపడాలి.

11. కులవ్యవస్థ, అంటరానితనం మొదలైనవాటిని పాటించడం మహాపాపం.ఐనా మనదేశంలో ఈదురాచారం ఇప్పటికీ వేళ్ళ పాతుకొనివుంది. అందరిలోను దేవుని రూపముంది. ఐనా నరుడు తోడినరుణ్ణి కేటాయిస్తున్నాడు. అణగదొక్కుతున్నాడు. నేడు మన తిరుసభలో కుల ప్రాబల్యం తక్కువేమికాదు. మన గురువులూ, మరకన్యలూ, పెద్దలూ కుల పక్షపాతానికి అతీతులు కారు. కనుక మన వేదబోధలో ఈ కులతత్వాన్ని తప్పక ఖండించాలి.

12. చాలసార్లు మన బోధకంటె మన జీవిత విధానం అధిక శక్తితో పనిచేస్తుంది. మన జీవితం ఆదర్శవంతంగా వుండాలి. మనలను చూస్తుంటే భగవంతుణ్ణి ప్రేమించి సేవించే మహానుభావులు ఈ భూమి మీద ఇంకా కొందరైనా వున్నారు అనిపించాలి. కనుక మంచి జీవితం గడపమని మన సమాజాల్లో ప్రజలకు నిరంతరం బోధిస్తుండాలి.

13. తీసికోవడం కంటె ఈయడం ధన్యం. మనమెప్పుడూ ఎవరివద్దనుండి ఏమి తీసికొందామా అని చూస్తుంటాం. మనకున్నది తులమో ఫలమో మనకంటె హీనులూ