పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగియదు. పౌలు చెప్పినట్లుగా, మనం పరలోక పౌరులం. దివినుండి మన ప్రభువైన యేసుక్రీస్తు రాకకై ఆతురతతో వేచివున్నాం - ఫిలి 3,20. ఆ రెండవ రాకడతోనేగాని మన విశ్వాసం పరిపూర్ణం కాదు. ఈ మధ్యకాలంలో ప్రభువు వరప్రసాదం మనకు తోడ్పడుతూంటుంది, అది మన విశ్వాసాన్ని బలపరుస్తూంటుంది. ఆ విశ్వాసానికి తగిన బహుమతిని మనం దేవునినుండి పొందేలా చేస్తూంటుంది.

మనం నిరీక్షించేవాటికి ఆధారభూతమైందీ మనం చూడలేనివాటిని నిరూపించేదీ విశ్వాసం

అంటుంది హెబ్రేయుల జాబు 11, 1. అనగా విశ్వాసం వల్లనే మనం భవిష్యత్తులో రానున్న మోక్షాన్నీ క్రీస్తు సాక్షాత్కారాన్నీనమ్ముతూన్నాం. కంటితో చూడకపోయినా భావిమోక్ష జీవితంమీద ఆశ పెట్టుకొని జీవిస్తూన్నాం.

2. విశ్వాస ఫలితాలు

1. విశ్వాసం మన క్రైస్తవ జీవితానికంతటికీ పునాది లాంటిది. మన రక్షణం దానితోనే ప్రారంభమౌతుంది. దాని మీదనే పునాదిలాగ నిలుస్తుంది. దానిలోనికే వేళ్లు పాతుకొంటుంది.

మన రక్షణం విశ్వాసంతోనే ప్రారంభమౌతుంది, దానితోనే మనం దేవుణ్ణి అంగీకరిస్తాం, పూజిస్తాం, ప్రేమిస్తాం. విశ్వాసం వల్లనే భావిలో రానున్న ఉత్థానాన్నీ మోక్షమహిమనీ నమ్ముతాం, శ్రద్ధలేందే దేవుణ్ణి సంతోషపెట్టలేం. అసలు మొదట మనం దేవుడున్నాడని విశ్వసించాలి. ఆ దేవుడు మన పుణ్యానికి తగిన ప్రతిఫలమిస్తాడని నమ్మాలి. కనుక ఆధ్యాత్మిక జీవితానికి మొదటిమెట్టు శ్రద్దే - హెబ్రే 11,6.

భవనం పునాదిమీద నిలుస్తుంది. ఆలాగే మన ఆధ్యాత్మిక జీవితంగూడ శ్రద్ధ మీదనే నిలుస్తుంది. పునాది గట్టిగా వుంటే కట్టడానికి ముప్పలేదు. మన శ్రద్ధ బలoగా వుంటే మన క్రైస్తవ జీవితంగూడ పటిష్టంగా వుంటుంది.

చెట్టు నేలలోనికి వేళ్లు పాతుకొంటుంది. దాని వేళ్లు నేలలోనికి చొచ్చుకొనిపోయి సారాన్ని గ్రహిస్తాయి. ఆలాగే మన ఆధ్యాత్మిక జీవితమనే చెట్టకి వేరు మన విశ్వాసమే. మన విశ్వాసవ వేరు ఎంత లోతుగా వుంటే మన ఆత్మ అంత బలంగా ఎదుగుతుంది.

2. శ్రద్ధ మనలను దేవునితో ఐక్యం జేస్తుంది. దానిద్వారా దేవుని జీవనం మనలోకి ప్రసరిస్తుంది. అతని ఆలోచనలు మనలోకి ప్రవేశిస్తాయి. మనం దేవునితో కలసిపోతాం.