పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాబిలోనియాలోని యూదులు ఆనాటి ప్రవక్తల బోధలను నమ్మారు. ఆ దైవభక్తులు చెప్పినట్లుగానే క్రీస్తు పూర్వం 583లో ప్రవాసం ముగిసింది. యూదులు మళ్లి యెరూషలేమకి తిరిగి వచ్చారు. ఈలా బాబిలోనియాలో యూదుల విశ్వాసదీపం ఆరిపోకుండ వెలిగేలా చేసింది ప్రవక్తలే.

4. భావికాల ప్రజల విశ్వాసం

ప్రవక్తలు నెత్తీ నోరూ బాదుకొని చెప్పినా యిస్రాయేలీయుల తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేదు. కనుక ప్రవక్తలు విసిగిపోయి తమ కాలంలో కాకపోయినా భావికాలంలో నయినా ప్రజలు తమ విశ్వాసాన్ని నిల్పుకొంటారని ప్రవచనాలు చెప్పారు. ఈ భావికాలం మెస్సీయా వచ్చే కాలం. తిరుసభ నెలకొనే కాలం. యిర్మీయా యీలా చెప్పాడు. సీనాయి నిబంధనం ఇక చెల్లదు. కనుక రాబోయే కాలంలో ప్రభువు యిస్రాయేలీయులతో నూత్న నిబంధనం చేసికొంటాడు. తన ధర్మశాస్తాన్ని వాళ్ళ హృదయాల్లోనే వ్రాస్తాడు. వారి పాపాలను మన్నీస్తాడు. వారికి దైవజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు - 31, 31-84.

యెహెజ్కేలు ఈలా నుడివాడు. కడపటి దినాల్లో ప్రభువు యిస్రాయేలీయులకు నూత్న హృదయాన్ని దయచేస్తాడు. వారిలోని రాతిగుండెను తీసివేసి దానిస్థానే మాంసపు గుండెను నెలకొల్పుతాడు. అవిధేయులైనవారిని విధేయులుగా మారుస్తాడు. తన ఆత్మద్వారా ప్రభువు "ఈ మార్పుని తీసికొని వస్తాడు - 36, 26-27. ఈ నూత్న నిబంధనం ద్వారా, ఈ గుండెల మార్పిడి ద్వారా భావికాలపు ప్రజలకు దేవుని మీద విశ్వాసం పడుతుంది.

ప్రవక్తలు భావికాలంలో చిన్న భక్తసమాజం ఏర్పడుతుందనీ, అ బృoదo భక్తి విశ్వాసాలతో ప్రభువుని కొలుస్తుందనీ చెప్పారు. ఈ భక్తబృందానికే “శేషజనం" అని పేరు. ఈ శేషజనం మొదట ప్రవక్తల శిష్యులే. రానురాను ఈ శేషజనం యిస్రాయేలు దేశమంతటా వ్యాపించారు. దేవుణ్ణి నమ్మి అతనిమీద ఆధారపడి జీవించడం వీళ్ళ ముఖ్యలక్షణం. వీళ్ళ తరచుగా పేదలు, కష్టాలు అనుభవించేవాళ్ళు, కనుక వీరికి "దీనులవర్గం" అనికూడ పేరు. (హీబ్రూలో "హనవిం"). నేను మీ నడుమ వినయాత్మలూ దీనులూ ఐన ప్రజలను వుంచుతాను. వాళ్ళు నన్నే నమ్మకొంటారు" అని జెఫన్యా వీరిని గూర్చే చెప్పాడు - 3,12. "నీతిమంతులు భక్తివిశ్వాసాలవలన జీవిస్తారు" అని హబిక్మూకు వీరిని గూర్చే వాకొన్నాడు -24. ఈ శేషజనం, ఈ దీనుల వర్గం, దేవుని పట్ల విశ్వాసంతో జీవిస్తారు. యెషయా వర్ణించిన బాధామయ సేవకుడు కూడ ఈ భక్తబృందానికి ప్రతినిధిగా వుంటాడు, ఆ మహానుభావుడు వధ్యస్థానానికి కొనిపోబడే గొర్రెపిల్ల లాగ, ఉన్నికత్తిరింపడే గొర్రెలాగ మౌనంగా వుంటాడేగాని నోరు తెరవడు - 58,7.