పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాల్టియా దేశంలో వసిస్తూండగా యావే అబ్రాహాముని పిల్చాడు. అతడు తాను కొలుస్తున్న దేవుళ్ళనూ చుట్టపక్కాలనూ వదలి యావే వెంటబడి వచ్చాడు. కొన్ని వేల మైళ్ళు ప్రయాణంచేసి కనాను దేశాన్ని చేరాడు - ఆది 12, 1-4, రెండవమారు, ముసలి ప్రాయంలోగూడ అబ్రాహాముకి బిడ్డపాప కలగలేదు. అతడు తన బానిసయైన యెలియసేరుని తన ఆస్తికి వారసుని చేద్దామనుకొంటున్నాడు. కాని ప్రభువు అతనితో నేను నీకొక కుమారుని దయచేస్తాను. అతని ద్వార నీ సంతానం ఆకాశంలోని చుక్కల్లాగ వ్యాప్తి చెందుతుంది అన్నాడు. ముసలి ప్రాయంలో తనకూ సారాకు ఏలా బిడ్డడు పడతాడా అని అబ్రహాము శంకించలేదు. అతడు ప్రభువు మాటలు నమ్మాడు. ఆ నమ్మకాన్నిబట్టి దేవుడు అతన్ని పుణ్య పురుషునిగా గణించాడు - 15, 4-6, మూడవ పర్యాయం, ప్రభువ ఈసాకుని బలి యిూయమని అడిగాడు. అబ్రహాముకి అతడు ఏకైక కుమారుడు, ప్రీతిపాత్రుడు. విలువలన్నిటికి పై విలువ. ఐనా ఆ పుణ్యపురుషుడు ఈసాకుని దేవునికి బలి యియడానికి జంకలేదు - 22, 12 ఈలాంటి మహానుభావుడు దేవుణ్ణి నమ్మిన వాళ్లందరికి తండ్రి కావడంలో వింత లేదుకదా!

2. సీనాయి నిబంధనం

యిస్రాయేలీయులు ఈజిప్టులో బానిసలయ్యారు. ఫరో పెట్టే కష్టాలను భరించలేక దేవునికి మొరపెట్టారు. యావే వారికి మోషే అనే నాయకుణ్ణి ప్రసాదించాడు. అతని ద్వారా వాళ్లకు ఈజిప్టునుండి తరలించుకొని వచ్చాడు. సీనాయి కొండ దగ్గర వాళ్లతో నిబంధనం చేసికొన్నాడు — నిర్గ24, 8. ఈ నిబంధనం ద్వారా వాళ్ల యావే ప్రజలయ్యారు. యావే ఆ ప్రజలకు దేవుడయ్యాడు. ఇక యావే ఆ ప్రజను ఒక మహాజాతిగా చేసి కాచికాపాడతాడు. వారికి వాగ్దత్త భూమిని దయచేస్తాడు. ఆ ప్రజలు యావేను మాత్రమే కొలవాలి. అతడు మెషేద్వారా దయచేసిన ధర్మశాస్తాన్నిపాటించాలి. యిస్రాయేలీయులు కనాను దేశములో స్థిరపడిన పిదపగూడ ఏటేట ఈజిప్టు నిర్గమనాన్ని స్మరించుకొంటూ పండుగ చేసికొనేవాళ్లు, అదే వాళ్ళ పాస్కోత్సవం - నిర్గ 12, 26–27.

కనుక యిస్రాయేలీయుల విశ్వాసానికి కేంద్రబిందువులాంటిది సీనాయి నిబంధనం. ఆ నిబంధనను బట్టే వాళ్లు యావేను విశ్వసించి అతన్ని ఆరాధించే ప్రజలుగా రూపొందారు. తర్వాత ఆ నిబంధన నియమాలను విశ్వాసంతో పాటించమని ప్రవక్తలు యూదులను నాల్లువందల యేండ్ల పొడుగున హెచ్చరిస్తూ వచ్చారు.