పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. ఓసారి ఓ యతి ఈజిప్టు మకేరియస్ దగ్గరికి వచ్చి అయ్యా! నాకేదైన ఉపదేశం చేయండని అడిగాడు. మకేరియస్ అతన్ని సమాధుల దొడ్డికి వెళ్లి అక్కడి మృతులను దూషించి రమ్మని చెప్పాడు. అలాగే ఆ యతి సమాధుల దొడ్డికెళ్ళి అక్కడ పాతిపెట్టబడిన వాళ్ళను దూషించాడు. వారిపై రాళ్ల విసరాడు. అతడు తిరిగివచ్చి మకేరియస్ను కలసికొని నీవు చెప్పినట్లే చేసివచ్చాను అన్నాడు. ముని ఆ మృతులు నిన్నేమిగా అనలేదా అని అడగ్గా యతి ఏమి అనలేదని చెప్పాడు. మకేరియస్ ఐతే రేపు వెళ్ళి వాళ్ళను స్తుతించిరా అని చెప్పాడు. ఆలాగే యతి వెళ్లి వాళ్లను స్తుతించాడు. మిూరు పునీతులు, నీతిమంతులు, అపోస్తలులు అని కీర్తించాడు. ఆ పిమ్మట మకేరియస్ దగ్గరికి వచ్చి నీవు చెప్పినట్లే చేసి వచ్చానని విన్నవించాడు. ఆ ముని వాళ్లు నీకేమియా జవాబు చెప్పలేదా అని ప్రశ్నించగా యతి లేదన్నాడు. అప్పుడు మకేరియస్ "నాయనా! ఆ మృతులను నీవు దూషించినా భూషించినా ఏవిూ చలించలేదు. రక్షణం పొందాలంటే నీవు కూడ ఆ చనిపోయిన.వాళ్ళలా తయారు కావాలి. లోకం లోని నరుల పొగడ్డలనూ తెగడ్డలనూ పట్టించుకోనివాడు తప్పక రక్షణం పొందుతాడు" అని చెప్పాడు.

42. మోషే అనే సన్యాసి కామ సంబంధమైన తలపుల్లో చిక్కుకొని నిరాశచెంది ఆశ్రమాన్ని వదలి వెళ్లిపోవాలనుకొన్నాడు. అతడు ఈసిడోర్ అనే ముని చెంతకు వెళ్ళి తన బాధను చెప్పకోగా ఆ ముని మోషేను తిరిగి తన గదికి వెళ్ళమన్నాడు. కాని మోషే నేను వెళ్ళలేనని పలికాడు. అప్పడు ఈసిడోర్ మోషేను ఇంటివిూదికి తీసికొని వెళ్ళి ఆకాశంలో పడమటి వైపు చూడమన్నాడు. మోషే అలాగే చూడగా అతనికి ఆదిక్కున చాల దయ్యాలు కన్పించాయి. అవి రణగొణ ధ్వని చేస్తూ నరులను శోధించడానికి సంసిద్ధమౌతూన్నట్లుగా కన్పించాయి. అంతట ఈసిడోర్ మోషేను ఆకాశంలో తూర్పుదిక్కునకు చూడమన్నాడు. అతడాలాగే చేయగా అసంఖ్యాకులైన దేవదూతలు దేదీప్యమానంగా వెలిగిపోతూ కన్పించారు. అటుపిమ్మట ఈసిడోర్ మోషేతో "నాయనా! ప్రభువు తూర్పున నున్న దేవదూతలను భక్తులకు సహాయం చేయడానికి పంపిస్తాడు. పడమట నున్న పిశాచాలు నరులకు అపకారం చేయడానికి వెళ్తాయి. కాని దేవదూతలు పిశాచాల కంటె ఎక్కువ సంఖ్యలో వున్నారు చూడు. కనుక మనకు ఆధ్యాత్మిక జీవితంలో శోధనల కంటె దైవసహాయమే అధికంగా లభిస్తుంది" అని చెప్పాడు. ఆ మాటలకు మోషే తెప్పరిల్లి దేవునికి వందనాలర్పించి తిరిగి తన గదికి వెళ్లిపోయాడు.

43. షేటిస్ ఎడారిలో ఓ ఆశ్రమంలో ఓ తాపసి ఏదో తప్ప చేసాడు. అతన్ని 'ఖండించడానికి అక్కడి తాపసులంతా ప్రోగై ఆ ప్రక్కనే నివసిస్తున్న మోషే మునికి గూడ కబురుపెట్టారు. కాని అతడు వెళ్ళలేదు. ఆశ్రమం నుండి గురువు అతనికి మల్లా కబురు