పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమారు ప్రభువు ఆత్మ బాబిలోను ప్రవాసంలో వున్న యెహెజ్కేలు ప్రవక్తను ఓ యుద్ధభూమికి కొనిపోయింది. ఆ రణరంగంలో చాలయేండ్ల క్రితమే వీరులు పోరాడి మరణించి వున్నారు. వాళ్ల ఎముకలు కుప్పలుగా పడివున్నాయి. ఆత్మ ప్రవక్తను ఆ యెముకలు సజీవులైన మానవులయ్యేలా ప్రవచింపమంది. అతడు అలాగే ప్రవచించాడు. వెంటనే ఆ యస్టులన్నీ పూర్వపు నరుల దేహాలను పొందాయి. కాని ఆ దేహాల్లో ఇంకా ప్రాణంలేదు. ఆ శరీరాల్లోకి ప్రాణం కూడ రావాలని ప్రవక్త మళ్ళా రెండవమారు ప్రవచించాడు. వెంటనే ఆ వీరులంతా సజీవులై లేచి నిలబడ్డారు.

ఈ సంవుటనమంతా ఓ సంకేతం. ఆ యెముకల గూళ్ళు సజీవులైన మానవులైనట్లుగానే ప్రవాసంలో వున్న యిస్రాయేలు ప్రజలు కూడ చైతన్యం పొందుతారు. వాళ్లు బాబిలోనులో తమ ప్రవాసం ఇంకా యెన్నాళ్ళ కొనసాగుతుందో అని నిరుత్సాహ పడుతున్నారు. అక్కడ వాళ్ళు చచ్చి సమాధి చేయబడిన వాళ్ళలాగ నిరుత్సాహంగా రోజులు సాగిస్తున్నారు. కాని ప్రభువు వారిని ఆ ప్రవాసమనే సమాధిలో నుండి బయటికి తీస్తాడు. తన ఆత్మను వాళ్లవిూద కుమ్మరించి వాళ్లను సజీవులను చేస్తాడు. ఆ యెముకల్లాగే ఆ ప్రజలు కూడ జీవంతో లేస్తారు, చైతన్యంతో యెరూషలేముకు తిరిగివెళ్తారు - యెహె 37.

ఇక్కడ ఆత్మశక్తితో ప్రవక్త పల్మిన వాక్కు వీరుల అస్థిపంజరాలకు జీవం కలిగించింది. ప్రవక్త వాక్కులో అంత శక్తి వుంటుంది. ఆ శక్తికి కారణం ఆత్మే.

ఈలాగే ప్రభువు ఆత్మయెషయా ప్రవక్తను ఆవేశించింది. ఈ యాత్మప్రేరణంతో అతడు పీడితులకూ బాధితులకూ సువార్తను ప్రకటించడానికి పూనుకొన్నానని చెప్పకొన్నాడు - 61.1. క్రీస్తుకూడ తన బహిరంగ జీవితారంభంలో నజరేతుకు వెళ్ళినపుడు అక్కడి ప్రార్థనామందిరంలో హీబ్రూ బైబులునుండి ఈ ఘట్టాన్నే యెత్తి చదివాడు. అది తనకు అక్షరాల వర్తిస్తుందని చెప్పాడు. అతడు గూడ ఆత్మచే ప్రేరితుడై బోధించిన మహాప్రవక్త గదా! — లూకా 4,18-21

మిూకా తన ప్రవచనాన్ని గూర్చి యిూలా చెప్పకొన్నాడు :

"ప్రభువు నన్ను తన ఆత్మతో నింపి బలాఢ్యుణ్ణి చేసాడు
ధైర్యమూ న్యాయబుద్దీ నాకు దయచేసాడు
కనుక యిప్రాయేలీయులకు నేను
వాళ్ళ తప్పిదాలను ఎరుకపరుస్తాను

"

- విూకా 3,8.

ఈలాంటి సందర్భాలను బట్టి ప్రవక్త ఆత్మచే ప్రేరితుడై ప్రవచనం చెప్పాడని అర్థం చేసికోవాలి.