పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దానికి లొంగి పోకూడదు. ధైర్యంతో చెడ్డతనాన్ని ఎదిరించే శక్తిని జ్ఞానస్నానంలోనే పొందుతాం. అది పరిశుద్ధాత్మ ఇచ్చేవరం. ఈ వరబలంతో దుర్మాతృకను ఎదుర్కుంటుండాలి ఇక, మనంతట మనం ఇతరులకు దుర్మాతృక నీయకుండా శతవిధాల జాగ్రత్తపడుతుండాలి. భక్తుడు విన్సెంటడపాల్ "చావైన పాపం చేయడం అంత అరుదైన కార్యంగాదు. న్యాయనిర్ణయ దినాన భయపడవలసిన ముఖ్యాంశాల్లో, ఈ లోకంలో వున్నపుడు మన మిచ్చిన దుర్మాతృక కూడ ఒకటి" అని వ్రాసాడు. ఈ భక్తుని వాక్యాలను మననం చేసికొని మనంగూడ ఈ దోషానికి గురౌతూన్నామో లేదో ఆత్మవిచారం చేసి చూచుకుందాం.

5. క్షమాపణ గుణం

సోదర ప్రేమకు సంబంధించిన ఓ ముఖ్య విషయం ఇతరులను క్షమిస్తుండడం. ఈ క్షమాపణ గుణం మన సోదరప్రేమ యదార్థమైందో కాదో పరీక్షించి చూచే గీటురాయి. క్షమాగుణం అలవరచుకోవడం అంత సులభంకాదు. అంచేత ఈ అంశాన్ని కొంచెం విపులంగా విచారించి చూద్దాం.

1. క్షమాపణం క్రీస్తు ఆజ్ఞ

పరలోక జపంలో మొత్తం ఏడు విన్నపాలున్నాయి. వీటిల్లో ఒక్కటి మాత్రం మిగతా వాటికంటే భిన్నంగా వుంటుంది. అది ఐదవది. ఈ యైదవ విన్నపంలో మాత్రం ఓ షరతు చేర్చబడింది. "మా యొద్ద అప్పపడినవారిని మేము మన్నించినట్లు మా యప్పలను మీరు మన్నించండి." ఈ వాక్యంలో "మా యొద్ద అప్పపడినవారిని మేము మన్నించునట్లు" అనే భాగం షరతు. అనగా మాకు అప్పపడిన వాళ్ళని (మాకు ద్రోహం చేసిన వాళ్ళని) మేము మన్నిస్తున్నాం గనుక, మా యప్పలను (మా ద్రోహాలను) మీరు మన్నించండి అనిభావం, అంటే మనం తోడి ప్రజలను క్షమించందే దేవుడు మనలను క్షమించడని ఫలితార్థం. & సందర్భంలో క్రీస్తు పలికిన ఇతర వాక్యాలు కూడ ఈ యర్గాన్నే సమర్ధిస్తాయి. "మీరు ఇతరుల అపరాధాలను క్షమిస్తే పరలోకంలోని మీ తండ్రి మీ యపరాధాలను కూడ క్షమిస్తాడు. మీరు ఇతరుల అపరాధాలను క్షమించకపోతే పరలోకంలోని తండ్రి మీ యపరాధాలను గూడ క్షమించడు - మత్త 6,14. కనుక క్షమాపణం క్రీస్తు ఆజ్ఞ. దీన్ని పాటించడమూ పాటించక పోవడమా అనే ప్రశ్నలేనేలేదు, ఇది నిత్యవిధి.

2. క్రీస్తు క్షమాపణం

క్షమాపణ గుణం అలవరచుకోవడం చాల కష్టమన్నాం. అందుకే క్రీస్తు ఈ పుణ్యాన్ని ఆచరణ పూర్వకంగా బోధించాడు. ప్రభువు సిలువ మీద వ్రేలాడుతూ తన శత్రువుల నుద్దేశించి "తండ్రీ వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలీదు. కనుక వీళ్ళను క్షమించు" అని