పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. కడన మనం అన్నివస్తువుల్లోను, అన్నిసంఘటనల్లోను, అందరు వ్యక్తుల్లోను దైవసాన్నిధ్యం గుర్తించాలి.

అన్ని వస్తువుల్లోను దైవసాన్నిధ్యాన్ని గుర్తించాలి. వస్తువులన్నిటికీ ఉనికినీ మనికినీ దయచేసేది ఆ ప్రభువే. కనుక మనం గాలి, నీరు, కొండలు నదులు, పైరుపంటలు, చెట్టుచేమలు మొదలైన ప్రకృతి వస్తువులను జూచినప్పుడు వాటిల్లో దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించాలి. "ప్రపంచమూ దానిలోని సమస్త వస్తువులూ ప్రభువ్వే" నని చెప్తంది కీర్తన 50, 12.

అన్ని సంఘటనల్లోను దైవసాన్నిధ్యాన్ని దర్శించాలి. ప్రియమైన సంఘటనల్లోను అప్రియమైన సంఘటనల్లోను గూడ దేవుని హస్తం వుంటుంది. మనకు జరిగే ప్రతి కార్యమూ ప్రభువుకి తెలుసు. అతని అనుమతి లేనిదే మన తల వెండ్రుక ఒక్కటి వూడదు - లూకా 12,7. ఇంకా దేవుడు తన్ను ప్రేమించేవాళ్లకి అన్ని కార్యాలూ అనుకూలంగానే జరిగేలా చూస్తాడు - రోమా 8, 28.

అందరు వ్యక్తుల్లోను దైవసాన్నిధ్యాన్ని చూడాలి. భగవంతుడు నరుణ్ణి తనకు పోలికగా చేసాడు - ఆది 1, 28. ఈలోకంలో నరుళ్ళాగ భగవంతుణ్ణి తలపించే ప్రాణి మరొకటి లేదు. కనుక మనం అందరు నరుల్లోను సృష్టికర్తను చూడాలి. మనం ఆయా వ్యక్తులను కలసికొనేపుడు వాళ్ళ దేవదూతలకు నమస్కారం చేయడం మంచిపద్ధతి. అన్యుల దేవదూతలు మన మా యన్యుల్లో దేవుణ్ణి చూడగలిగేలా చేస్తారు. వాళ్ళవల్ల మనకీ మనవల్ల వాళ్ళకీ వుపకారమేగాని అపకారం జరగకుండా ఉండేలా చేస్తారు.

ఈ సందర్భంలో "దేవుని సన్నిధిలో నడవడం" అనే భావాన్ని గుర్తుకి తెచ్చుకోవాలి. బైబులు భక్తులు భగవంతుని సన్నిధిలో నడచారు. హనోకు దేవుని సన్నిధిలో నడచాడు - అది 5,22. అలాగే నోవా - 6 9. అలాగే యెలీషాకూడ - 1 రాజు 17,1. ఈపుణ్య పురుషుల్లాగే మనంకూడ నిరంతరం దేవుని సన్నిధిలో నడుస్తూండాలి.

ఈ పదవది చాల విస్తృతమైన అభ్యాసం. ఇది ఆధ్యాత్మిక జీవితంలో పరిణతి చెందినవాళ్ళకేగాని అలవడదు.అన్నిటిలోను దేవుణ్ణీ, దేవుణ్ణి అన్నిటిలోను చూడ్డం మహాభక్తుల లక్షణం.

9. దైవసాన్నిధ్యాన్ని పాటించడంలో ఎదురయ్యే అవరోధాలు

మనలోని కొన్ని దుర్గుణాల వలన మనం దైవసాన్నిధ్యాన్ని గుర్తించలేక పోతూంటాం. ఇక్కడ వీటినిగూర్చి విచారిద్దాం.

1. గర్వాత్మలు దేవుణ్ణి చూడలేరు. గర్వంవల్లనే ఆదిమానవుడు దేవునిమీద తిరుగుబాటు చేసాడు. ఆదిపిత సంతానమైన మనంకూడ తరచుగా పొగరువల్ల దైవదర్శనాన్ని కోల్పూతూంటాం. గర్వం మన హృదయానికీ మనస్సుకీ ఒక విధమైన చీకటి తెరలు