పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కప్పుతుంది. అందువల్ల మనం ఆ పరంజ్యోతిని చూడలేకపోతూంటాం. దేవుడు గర్వాత్మల్ని ఎదిరించి వినయాత్ములకు తన కృపను అనుగ్రహిస్తాడని చెప్తుంది యాకోబు జాబు - 4,6. కనుక గర్వాన్ని అణచుకొని వినయాన్ని అలవర్చుకొంటే దైవసాన్నిధ్యంలో నడవగల్లుతాం.

2. స్వార్ధంవల్లకూడ దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతాం. స్వీయ ప్రీతికలవాడు ప్రతికార్యంలోను తన్నుతాను సంతోషపెట్టుకోజూస్తాడు. అన్నిటిలోను తన ప్రీతినే కోరుకొంటాడు. అలాంటివాడు భగవంతుణ్ణిగాని తోడినరుణ్ణికాని అట్టే పట్టించుకోడు. తన్ను వెదకనివాడికి, తన్ను కోరుకోనివాడికి ఆ భగవంతుడు ఏలా దర్శనమిస్తాడు? కనుక భగవంతుణ్ణి పొందగోరేవాడు తన్నుతాను సంతోషపెట్టుకోవడం మానుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి పూనుకోవాలి. తన్నుతాను వెదకేవాడికి తాను దొరుకుతాడు. కాని అది తన వినాశానికే, ఆలా కాకుండ భగవంతుణ్ణి వెదకేవాడికి ఆ ప్రభువు దొరుకుతాడు. అది అతని సౌభాగ్యానికి దారితీస్తుంది.

3. ఇహలోక వస్తువ్యామోహంకూడ మనం దైవసాన్నిధ్యాన్ని గుర్తించకుండా వుండేలా చేస్తుంది. పక్షిని త్రాటితో కట్టివేస్తే ఇక అది పైకి యెగరలేదు. ఆలాగే మన ఆత్మనుకూడ లోకవస్తు మమకారంతో బంధిస్తే ఇక అది దేవుని వద్దకు ఎగిరిపోలేదు. ఒకోసారి చంద్రబింబానికి మబ్బు అడ్డుపడుతుంది. ఇక చందమామ కన్పించదు. ఆలాగే సృష్టివస్తు వ్యామోహంవలన నేత్రాలకు దట్టమైన తెరలు అడ్డుపడతాయి. ఇక భగవంతుణ్ణి చూడలేం. ప్రభువు ఇద్దరు యజమానులను సేవించవద్దన్నాడు. ఇద్దరు యజామానులూ దేవుడూ లోకవస్తువులూనూ - మత 6,24, వలలో చేపలాగ లోకవసువుల్లో తగులుకొన్నవాడికి దేవుడు దొరకడు. నిరంతరమూ లోకంలోని భౌతిక వస్తువులతో సతమతమై పోయేవాడు పరలోకంలోని ఆధ్యాత్మిక వస్తువులమీదికి మనసు త్రిప్పలేడు.

4. పై వస్తువ్యామోహంలాంటిదే యింద్రియ ప్రీతికూడాను. పాపపుమానవుడు లోకవస్తువులను అనుభవించి ఇంద్రియాలకు ప్రీతి కలిగించుకోవాలని చూస్తుంటాడు. నిరంతరమూ ముక్కూ నాలుక, కన్ను చెవి, స్పర్శ మొదలైన కర్మేంద్రియాలను సంతోషపెట్టుకోవాలని కోరుకొంటాడు. దేహ వాంఛలను దాటిపోనివాడికి ఆత్మస్వరూపుడైన భగవంతుడు ఏలా దొరుకుతాడు? పౌలు చెప్పినట్లుగా, మన శరీరం మన ఆత్మ కోరక్షాన దివ్యమైన కోరికలకు విరుద్ధంగా పాపపు కోరికలు కోరుకొంటుంది - గల 5,17. కనుక క్రీస్తు యేసునకు చెందినవాళ్ళ వ్యామోహాలతోను కోరికలతోనుగూడిన తమ శరీరాన్ని సిలువవేసికోవాలి - 5,24. ఆలాంటి వాళ్ళకే గాని దైవదర్శనం లేదు.

5. ఒకోసారి వదరుబోతుతనం వల్లగూడ దైవసాన్నిధ్యాన్ని కోల్పోతాం. మనం మాట్లాడేపుడు లోకవస్తువులను గూర్చి - అనగా మనం కన్నవాటినీ విన్నవాటినీగూర్చి - మాట్లాడతాం. కనుక మన మనసు లోకవస్తువులమీదనే లగ్నమౌతుంది. ఇక పరలోక