పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. దైవసాన్నిధ్యాన్ని పాటించడానికి పది సూత్రాలు

దైవసాన్నిధ్యాన్ని పాటించడానికి ఉపయోగపడే మార్గాలుకొన్ని వున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. మనం దేవునికి చెందినవాళ్ళం, అతడు మనకు చెందినవాడు అనుకోవాలి. ఆ ప్రభువుని పొందడానికి విశ్వప్రయత్నాలు చేయాలి. భగవంతుణ్ణి పొందాలని గాఢంగా కోరుకొనేవాడు అతన్ని ఏలాగైనాసరే పొందితీరుతాడు. తీవ్రమైన ఉత్కంఠ పనులు సాధించిపెడుతుంది.

2. మనం చేసే పనులన్నీ దేవుని సన్నిధిలో చేస్తున్నామని భావించుకొని వాటిని మనకు చేతనైనంత బాగాచేయాలి. కాని దేవుడు మనలను చూస్తున్నాడు అని భావించుకోవడంవల్ల మనమేమీ ఆందోళనం చెందకూడదు. తొందర పాటునకు గురికాకూడదు. గగ్లోలుపడకూడదు. నిదానంగా, ప్రశాంతంగా, నమ్మకంతో, వినయంతో మన పనులను మనం చేసికొంటూ పోవాలి. ఈ పద్ధతివల్ల దేవుడు మన చుట్టూ వున్నాడనే భావం మన మనసులో బలపడుతుంది.

3. ఒకోసారి మనం పొరపాటుచేస్తాం. పాపంలో కూడ పడిపోవచ్చు. అలాంటప్పుడు మనం తప్పకుండా పశ్చాత్తాపపడాలి. కాని దిగులుపడకూడదు. మనమీద మనం కోపం తెచ్చుకొని చిత్తశాంతిని కోల్పోకూడదు. అనగా మనం దేవడ్డీదైవసాన్నిధ్యాన్నీ నమ్మాలి. దైవబలం వలన క్రమేణ పరిపూర్డుల మౌతామని విశ్వసించాలి. చిన్నబిడ్డడు అడుగులు వేస్తూ పడిపోతాడు. కాని ఓసారి పడిపోయాక తల్లి చేతిని మరింత గట్టిగా పట్టుకొంటాడు. దేవుని సన్నిధిలో మన ప్రవర్తనంకూడ ఈలాగే వుండాలి.

4. దేవుడు మన హృదయంలోనే వున్నాడు అనుకోవాలి. ఈ సందర్భంలో అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు. "నీవు కొంతకాలంపాటు లోక వస్తువులనుండి వైదొలగు. నీ మనస్సులోని ఆలోచనలనుకూడ నిరోధించు. నెమ్మదిగా నీ హృదయమనే గదిలోకి ప్రవేశించు. నీ హృదయంలోనుండి అన్ని వ్యామోహాలనూ, అన్ని కోరికలనూ ప్రక్కకు నెట్టివేయి. నీ దేవుణ్ణి మాత్రం నీ హృదయ సింహాసనంమీద ఆసీనుణ్ణిచేసికో. ఆ మహా ప్రభువుతో "దేవా! నీవు నన్ను నీ సన్నిధిలోకి రమ్మని పిల్చావు. ఇదిగో నేను నీ సమక్షంలోకి వచ్చాను. నీ దివ్యముఖాన్ని నాకు మరుగుజేయకు" అని విన్నవించుకో - కీర్త 27,8. ఆ ప్రభువునిచూచి దేవా! నేను నిన్ను ఏలా గుర్తుకి తెచ్చుకోవాలో నీవే నాకు నేర్పించు అని అడుగుకో". ఈలా మన హృదయంలోనేవున్నదేవుణ్ణి మనం ధ్యానించుకోవడం నేర్చుకోవాలి.