పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్ద తెరేసమ్మగారు తన యాత్మమే తనకు ఆంతరంగికమైన స్వర్గమని భావించేవారు. ఆ స్వర్గంలో క్రీస్తుప్రభువు ఆనందంతో వసిస్తూంటాడని యెంచేవారు. ఆ ప్రభువుకి భక్తిభావంతో ప్రణమిల్లేవారు. ఈ యభ్యాసంవల్ల మనం అనతికాలంలోనే దైవసాన్నిధ్యాన్ని గుర్తిస్తామని చెప్పేవారు. హృదయంలో దేవుణ్ణి గుర్తించే భక్తులు జీవజలప ఊటనుండి నీళ్ళు క్రోలుతారని వాకొనేవారు. ఈ యభ్యాసం నచ్చినవాళ్లు దీన్ని పాటించవచ్చు.

సియన్నాపురి కత్తరీన అనే భక్తురాలు తన హృదయం ఓ దేవాలయం అనుకొనేది. ఆ హృదయంలో దేవుడు నెలకొని వున్నాడని భావించేది. తాను ఆ హృదయ దేవాలయంలోనికి ప్రవేశించి రణగొణధ్వనుల నుండి వైదొలగి దేవుని సన్నిధిలో నిమ్మళంగా వుండిపోయేది. ఆ ప్రభువుకి చేయెత్తి మ్రొక్కేది. ఈ పద్ధతి కొందరికి నచ్చవచ్చు. జ్ఞానస్నాన సమయంనుండే పవిత్రాత్ముడు మన హృదయంలో ఓ ఆలయంలోలాగ వసిస్తూంటాడు. దేవుడెక్కడవుంటే అదే దేవాలయం. అతడు మన యెడదలో వుంటే అదే దేవాలయమౌతుంది. కనుక మన హృదయమే దేవాలయం అనుకోవడం మంచి భావమే - 1కొరి 6,19.

బెతనీ మరియు ప్రభువు పాదాలచెంత కూర్చుండి అతని వాక్యాలను భక్తిభావంతో ఆలించిందని వింటున్నాం - లూకా 10,39. ఆమె మాటలాడలేదు. విలపించలేదు. ప్రార్ధించలేదు. ఏమీ చేయలేదు. మౌనంగా ప్రభువు పాదాలచెంత కూర్చుండి అతని బోధను మాత్రం ఆలించింది. ఆమె అక్క మార్త ఆమెకు అంతరాయం కలిగించబోయింది. మరియు అక్కడ నుండి లేచివచ్చి వంటపనిలో తనకు సహాయం చేస్తే బాగుంటుందని సూచించింది. కాని ప్రభువు మార్తను మందలించి మరియను సమర్ధించాడు. మరియ ఉత్తమమైన కార్యం ఎన్నుకొంది అని చెప్పాడు – 10, 42. ఈ మరియలాగే మనం కూడ మన హృదయంలోనే వసించే ప్రభువు పాదాలచెంత నిమ్మళంగా కూర్చోవాలి. అతని పలుకులు భక్తిభావంతో ఆలించాలి. అతడు తన భక్తులందరికీ వాళ్ళ హృదయాలలోనే నిరంతరమూ బోధ చేస్తూంటాడు.

5. మనం ఉదయాన నిద్ర మేల్కొనగానే దైవసాన్నిధ్యాన్ని గుర్తుకి తెచ్చుకోవాలి. మన దేహం కండ్లు తెరవగానే మన ఆత్మకూడ కండ్ల తెరవడం మంచిది. మనం మన హృదయంలోనే వున్నదేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించాలి. అతనితో "ప్రభూ! నీవు నా కండ్లు తెరిపించావు. ఆలాగే నా ఆధ్మాత్మిక నేత్రాలను కూడ తెరిపించు. వాటితో నేను నీ దివ్యముఖాన్ని దర్శిస్తాను. నీవు నన్ను చల్లని చూపనచూడు. నీ దృష్టికి పాత్రుణ్ణయితే చాలు నేను బ్రతికిపోతాను. దేవా! ఈ దినమంతా నేను నిన్ను స్మరించుకొనేలాచేయి. నీ