పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయమూ ఇంతేకదా? మనం దేవుణ్ణి 24 గంటలూ గుర్తుంచుకో లేకపోవచ్చు. కాని రోజులో కొన్నిసార్లు అతన్ని భక్తిభావంతో జ్ఞప్తికి తెచ్చుకోవడం కష్టమౌతుందా? ఈపాటి తేలికపనిగూడ చేయనివాడు మోక్షానికి గాక నరకానికి అరుడుకాడా?

3. మరికొందరు ఈ యభ్యాసంవల్ల మాకు సోమరితనం పెరుగుతుందనీ, మా బాధ్యతలను మేము చక్కగా నిర్వర్తించలేమనీ సాకులు చెప్పవచ్చు. కాని దేవుని సేవలో కాలం గడపడం సోమరితన మౌతుందా? ఆ ప్రభువుని ధ్యానించుకోవడంవల్ల మన బాధ్యతలను విస్మరిస్తామా? ఈలా తలంచడం పొరపాటు కాదా? దేవుని సన్నిధిలో నడచేవాళ్ళు చక్కగా ప్రార్ధనం చేసికొంటారు. ఆ దేవునిపట్ల గల భక్తిభావంతో తమ పనిని చిత్తశుద్ధితో చేస్తారు. ఇరుగుపొరుగువారితో ప్రేమభావంతో సంచరిస్తారు. ఇక్కడ మన పనులన్నీ మానివేసి దేవుణ్ణి స్మరించుకొంటూ కూర్చోం, దేవుణ్ణి ధ్యానించుకొంటూ మన పనులు మనం చేసికొంటాం.

4. వేరు కొందరు ఈ యభ్యాసంవల్ల జనుల తామే భక్తిమంతులమనుకొని విర్రవీగుతారు అని వాదించవచ్చు. పూజలో పాల్గొని సత్రసాదం పుచ్చుకొనేవాళ్లకూడ ఈలాగే పొగరుబోతు తనంతో విర్రవీగవచ్చుకదా? అందుకని పూజనీ సత్రసాదాన్ని మానివేయంకదా? అలాగే ఈ యభ్యాసాన్నికూడ మానివేయకూడదు. పైగా దైవసాన్నిధ్యాన్ని పాటించేవాడు గర్వాన్ని గాక వినయాన్ని అలవర్చుకొంటాడు. దేవుని ముందట నేనంతటివాణ్ణి ఇంతటివాణ్ణి అని అనుకోవడానికి ఎవడు సాహసిస్తాడు?

5. మాకిన్ని పనులుంటే దైవసాన్నిధ్యంలో కూర్చోవడానికి వ్యవధి యొక్కడిది అనికూడ ఎవరైనా అడుగవచ్చు. కాని మన పనులను మన స్వీయశక్తితోనే చేస్తామా? దైవబలంవల్ల కాదా? దైవబలాన్ని గుర్తుకితెచ్చుకొంటే ఆ ప్రభువు తన వరప్రసాదంతో మనకు సాయంజేయడా? అప్పుడు మన పనులు సులువుగా నెరవేరవా? దేవుడు మనం మన పనులన్నీ మానివేసి తన యెదుట వట్టినే చేతులు ముడుచుకొని కూర్చోవాలని కోరుకోడు. మన పనుల్లో మనం తన్ను స్మరించుకోవాలని మాత్రమే కోరుకొంటాడు. ఆలా చేస్తే మనకే లాభం.

మఠజీవితంలోగాని సంసారజీవితంలోగాని దేవుణ్ణి చిత్తశుద్ధితో పూజించే భక్తిమంతులు కొందరుంటారు. వాళ్ళల్లో చేరడం మనకు శ్రేయస్కరం. అసలు మనలను చేసింది ఆ దేవుడు. మనకు ఈ పనులన్నీ అప్పగించిందీ ఆ దేవుడే అతన్నిస్మరించుకొంటే మన జన్మ సార్థకమౌతుంది. అతడు మనకిచ్చిన పనులనుకూడ దివ్యంగా చేస్తాం. కనుక దైవసాన్నిధ్యాన్ని పాటించకపోతే నష్టంగాని పాటిస్తే నష్టమేమీలేదు. ఇంకా బోలెడెంత లాభమే కలుగుతుంది.