పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రకారుడు మూలచిత్రంమీద దృష్టిని నిల్పి అలాంటి చిత్రాన్నే గీస్తాడు. ఆలాగే దేవుణ్ణి ధ్యానించుకొనే నరుడు దేవునిలాంటివా డౌతాడు. నిప్పులో పెట్టిన ఇనుము నిప్పులా తయారౌతుంది. పరిమళాల మధ్య నిల్చినవాడు కూడ పరిమళాలు గుబాళిస్తాడు. ఆలాగే దేవుని సన్నిధిలో నడచేవాడు కూడ దేవునిలాంటివా డౌతాడు.

భగవంతుణ్ణి హృదయంలో నిల్పుకోడానికి అలవాటుపడిన సజ్జనుడు భగవంతుణ్ణి విడచి వుండలేడు. దేహంలో స్థానంతప్పిన ఎముక ఏమౌతుంది? నీటిలో నుండి వెలికితీసిన చేప ఏమౌతుంది? భగవంతుని సాన్నిధ్యానికి అలవాటుపడిన భక్తుడు ఆ ప్రభువుని కోల్పోతే ఇక అతనికి పట్టేగతికూడ ఆలాగే వుంటుంది.

కావుననే అగస్టీను భక్తుడు "ప్రభూ! మా హృదయాన్ని నీ కొరకే చేసావు. నీయందు విశ్రమించిందాకా దానికి విశ్రాంతిలేదు" అని అనుభవపూర్వకంగా చెప్పగలిగాడు. కనుక నరుడు దేవుని సన్నిధిలో నడుస్తూ ఆ ప్రభువుని అనుభవానికి తెచ్చుకొంటూండాలి.

7. సాన్నిధ్యభక్తిని కాదనేవాళ్ళకు జవాబు

1. కొందరు ఈ యభ్యాసం ఎవరో భక్తిమంతులకుగాని మాబోటివాళ్ళకు కాదు అని అనవచ్చు. ఇది పొరపాటు. ఈయభ్యాసం అందరికీ అవసరమే. మనం ఈ లోకంలో ఎందుకున్నాం? దేవుణ్ణి తెలిసికొని ప్రేమించి సేవించడానికేగదా? ఆ ప్రభువు సాన్నిధ్యాన్ని గుర్తుకితెచ్చుకోకపోతే అతన్నేలా ప్రేమిస్తాం? లోకంలోని నరులు దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నారు? తమ హృదయంలోనే వసించే ఆ ప్రభువుని ఎందుకు గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారు? అతని సాన్నిధ్యాన్ని మర్చిపోవడంవల్లనేకదా? కనుక అతని సాన్నిధ్యాన్ని గుర్తించే ఈ యభ్యాసం మనకందరికీ అవసరమే ఔతుంది.

దేవుడు అందరి సన్నిధిలోను వుంటాడు కనుక మన మందరమూ ఆ దేవుని సన్నిధిని గుర్తించి అతనికి నమస్కరించాలి. అతన్ని ప్రేమించి స్తుతించి కీర్తించాలి. పూర్వం యూదులు ఆరాధన సమయంలో ప్రధాన యాజకుడు ధరించే పవిత్రవస్త్రంమీద 12మణులు పొదిగివుంచేవాళ్ళు. ఆపండ్రెండు మణులను చూచి యావే ప్రభువు పండ్రెండు తెగల యిస్రాయేలు ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొనేవాడు. ఆ ప్రజలుకూడ నిరంతరమూ అతన్ని గుర్తుకితెచ్చుకొనేవాళ్ళు. ఈలాగే మనంకూడ ఆ దేవుణ్ణి సదా జ్ఞప్తికి తెచ్చుకొంటూండాలి.

నిర్గమ 28,21

2.ఇంకా కొందరు ఈ యభ్యాసం చాల కష్టమైంది, మేమీకార్యాన్ని చేయలేము అని అనవచ్చు. దేవుడు మనకు తండ్రిలాంటివాడు, తల్లిలాంటివాడు, స్నేహితుని లాంటివాడు. తన అమ్మనీ నాన్ననీ జ్ఞప్తికి తెచ్చుకోడానికి ఇష్టపడని బిడ్డడెవడైనా వుంటాడా? అసలీ అమ్మనీ నాన్ననీ మర్చిపోవడం కంటి జ్ఞప్తికి తెచ్చుకోవడమే సులభంకాదా? దేవుని