పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాపాడలేరు కూడ". కనుక మనం క్రీస్తుని హృదయంలో నిల్పుకొని అతని మాట పాటిస్తే చాలు, అతని సన్నిధిలో నడిస్తేచాలు, తప్పక పరిపూర్ణుల మౌతాం.

4. ఈ యభ్యాసంవల్ల విశ్వాసం, నిరీక్షణం, దైవప్రేమ అనే పుణ్యాలు పెరుగుతాయి. దేవుణ్ణి తరచుగా గుర్తుకి తెచ్చుకొనేవాడికి విశ్వాసం వృద్ధి చెందుతుంది. అతన్నిస్మరించుకొనేవాళ్లకి నిరీక్షణం పెరుగుతుంది. అతన్ని అనురాగంతో ధ్యానించుకొనే వాళ్లకి దైవప్రేమ పెరుగుతుంది.

5. ఈ యభ్యాసాన్ని పాటించే భక్తుడు ఇతర పుణ్యాలను కూడ ఆర్జిస్తాడు అతడు దేవుణ్ణి పూజిస్తాడు. ఆ ప్రభువుకి హృదయార్పణం కావించుకొంటాడు. ఆ మహారాజు సన్నిధిలో అణకువ కలిగి వుంటాడు. అతనికోసం తోడినరులను ఆదరిస్తాడు. ఈలా అన్ని సద్గుణాలూ అలవర్చుకొంటాడు. కనుకనే బాసిల్ భక్తుడు "నీవు చేసేపనులను చక్కగా చేయాలనుకొంటే దేవుడు నిన్ను గమనిస్తున్నాడని భావించుకో" అని వాకొన్నాడు.

6. ఇది అన్నిటికంటె ఉత్తమమైన అభ్యాసం అనడంలో సందేహం ఏమీ లేదు. దేవుడు అబ్రాహాముకి దర్శనమిచ్చి "నీవు నా సన్నిధిలో నడుస్తూ పరిపూర్ణుడవై యుండు" అని ఆజ్ఞాపించాడు - ఆది 17,1. అనగా అబ్రాహాము దేవుని సన్నిధిలో నడిస్తే చాలు, పునీతు డౌతాడన్నమాట. కనుక ఈ యభ్యాసాన్ని పాటించే భక్తుడు దేవునితోనూ, దేవునియందూ, దేవునిద్వారా జీవిస్తాడు. పరిపూర్ణత అంటే యిదే. ఆ భక్తుడు నిరంతరమూ దేవునితో సంభాషిస్తుంటాడు కనుక దేవునితో కలసి జీవిస్తాడు. దేవునియందే విశ్రాంతిని అనుభవిస్తాడు కనుక అతనియందు జీవిస్తాడు. ఆ భగవంతుట్టే ఆహారంగాను జీవంగాను చేసికొంటాడు కనుక అతని ద్వారా జీవిస్తాడు. ఇది యెనలేని భాగ్యం.

అద్దం ఎదుట నిలబడితే మన ఆకారం దానిలో ప్రతిబింబిస్తుంది. దేవుని సన్నిధిలో నడచే సత్పురుషుడు కూడ ఆ దేవుడనే అద్దంలో ప్రతిబింబిస్తాడు. ఆ దివ్య ముకురంలో ప్రతిబించించనపుడు మనలోని మురికీ వికృతత్వమూ స్పష్టంగా కన్పిస్తాయి. ఆ ప్రభువు అనుగ్రహంతోనే మనం మన వికృతత్వాన్ని సవరించుకొంటాం.

దేవుని సన్నిధిలో నడచేవాళ్లు ఇక యీ సృష్టి వస్తువులకు అంటిపెట్టుకోరు. దేవుడుకాని ప్రతివస్తువుకూడ వాళ్లకు నిస్సారంగా కన్పిస్తుంది. క్రీస్తుతో పోల్చిచూస్తే ఈ లోకంలోని వస్తువులన్నీ చెత్తాచెదారం లాంటివి అన్నాడు పౌలు - ఫిలి 3,8. దైవసాన్నిధ్యాన్ని అనుభవానికి తెచ్చుకొన్న భక్తులంతా ఈలాగే భావిస్తారు. వాళ్లు దేవుడొక్కడున్నాడు, ఈ లోకవస్తువుల్లో ఏముంది అని ప్రశ్నిస్తారు.

దేవుని సన్నిధిలో నడచే విశుద్దాత్మడు క్రమేణ దివ్యత్వాన్ని పొందుతాడు. నిత్యజీవితంలో మనం ఎవరితో తిరుగాడుతూంటామో వాళ్ళలాంటివాళ్ళ మైపోతాం.