పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58. ప్రేమ

క్రీస్తు మనలను పేమించి మనకోసం తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు — ఎఫే 5,2. అతడు శ్రీసభను ప్రేమించి ఆ సభకోసం తన ప్రాణాలర్పించాడు- ఎఫే 5, 27. అపోస్తలుల కార్యాల్లోనూ, సువార్తల్లోను క్రీస్తు ద్వేషులైన యూదులు-యూదా, పిలాతు మొదలైన వాళ్ళు - అతన్ని అప్పగించారు అని చెప్పబడింది. కాని పౌలు లేఖలు తండ్రే క్రీస్తుని "అప్పగించాడు" అని చెప్తాయి - రోమా 8, 32. ఈ తండ్రి ద్వేషంచేగాదు, మనపట్లగల ప్రేమచే తనే కుమారుణ్ణి అర్పించాడు. క్రీస్తు ప్రేమతోనే మనకోసం తన్నుతాను సమర్పించుకున్నాడు. కనుకనే పౌలుతో పాటు మన మందరమూ “దేవుని కుమారుడు నా కొరకు తన్నుతాను అప్పగించుకున్నాడు" అని చెప్పగల్లుతూన్నాం - గల 2, 20. క్రీస్తు విధేయతలాగే, అతని యీ ప్రేమభావం గూడ మనలను రక్షించిందనాలి. ప్రభుప్రేమను అర్థంజేసికునే భాగ్యంకోసం వేడుకుందాం.

59. ప్రాణా లొడ్డడం - యోహా 15,13

క్రీస్తు ప్రేమభావంతోనే చనిపోయాడన్నాం. దీన్నే సాల్గవ సువార్త "ప్రాణాలొడ్డడం" అంటుంది. నా గొర్రెల కోసం ప్రాణాలొడ్డుతున్నాను." అంటాడు ప్రభువు - యోహా 10,15. మరోతావులో ప్రభువు "స్నేహితులకొరకు ప్రాణాలొడ్డీవానికంటె ఎక్కువ ప్రేమగల వాడెవడూ లేడు" అంటాడు ప్రభువు - 15, 13, "ఆయన మన నిమిత్తం ప్రాణాలొడ్డాడుగనుక దీనివలన ప్రేమ యేలాంటిదో తెలిసికోగల్లుతున్నాం" అంటుంది 1 యోహా 3,16. ఈ వాక్యాలను బట్టి క్రీస్తు నరులను ప్రేమించాడనీ, ప్రేమతోనే వాళ్ళకోసం స్వీయప్రాణాలు అర్పించాడనీ విశదమౌతూంది గదా!

60. పరిమళవాసన లొలికే బలిగా - ఎఫె, 5,2.

క్రీస్తు ప్రేమతోను విధేయతతోను మనకోసం ప్రాణాలర్పించాడన్నాం. ఈ ప్రేమ విధేయతాభావాలను ఓ బలిగా భావించాలి. ఎఫేసీయులు 5,2 క్రీస్తు మనలను ప్రేమించి పరిమళవాసన లొలికే బలిగా తన్ను తాను పితకు అర్పించుకున్నాడు అంటుంది. పూర్వ వేదంలోని దహనబలిని పరిమళ వాసనలొలికే బలి అనేవాళ్లు - నిర్గ. 29,18. క్రీస్తు సిలువ బలిగూడ ఈ దహనబలిలాంటిదే. బలిజంతువును పీఠంమీద కాల్చి వేయగా పొగగా మారిపోయి దేవుని సింహాసనం వైపునకు ఎగసిపోతుంది. అబ్రాహాము ఈసాకును వధించలేదు గాని వధించి బలిగా అర్పించినట్లయితే అతడూ ఈలాగే పొగగా మారిపోయి దేవుని సన్నిధికి ఎగసిపోయేవాడే. ఈలా ఎగసిపోవడాన్నే నరుడు దేవుణ్ణి చేరడం అంటాం. ఇక సిలువ వేయబడిన క్రీస్తుకూడ తన ప్రేమ విధేయతల ద్వారా తండ్రి వైపునకు ఎగసిపోయాడు. ఈ యంశాన్నే నాల్గవ సువార్త"యేసు ఈలోకాన్ని వీడి తండ్రి యొద్దకు మరలిపోవలసిన గడియ వచ్చెనని యెరిగి" అన్న మాటల్లో సూచించింది - 13,1.