పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ విధంగా క్రీస్తు సిలువబలి పూర్వవేదంలోని బలులన్నిటినీ సార్థకంజేస్తుంది. ఈ బలిద్వారానే ఆ ప్రాచీన బలులన్నీ ఫలితాన్ని ఈయగలిగాయి. క్రీస్తు సిలువబలి మనకూ రక్షణాన్ని చేకూర్చిపెట్టాలని ప్రార్థిద్దాం.

45. పాపికి బదులుగా జంతువు

ప్రాయశ్చిత్తబలుల్లో జంతువు బలిగా సమర్పింపబడిందన్నాం. కాని యీ తంతునుజూచి కొందరు పాపికి బదులుగా బలిపశువు సమర్పింపబడింది కాబోలు అనుకున్నారు. నరుడు పాపంజేసి శిక్షకు పాత్రుడయ్యాడు. పాపఫలితంగా అతడు చావాలి. కాని అతడు చావకుండ తనకు బదులుగా, కోడెలు, మేకలు మొదలగు బలిపశువులను దేవుని కర్పించాడు. దేవుడు నరునికి బదులుగా, నరుని తావులో ఆ పశువులను స్వీకరించి అతన్ని చంపకుండా వదలివేసాడు - ఇది కొందరివాదం. కాని ఈ వాదం నిలువజాలదు. బైబులు భగవంతుడు జంతుమరణానికి సంతోషించేవాడు గాదు. యెహెజ్కేలు చెప్పినట్లు, అతడు ప్రాణి జీవించాలని కోరుకుంటాడే గాని నశించాలని కోరుకోడు - 33, 11 ప్రవక్త పల్కిన యీ వాక్యంమీద వ్యాఖ్యజెబుతూ జ్ఞానగ్రంథకర్త "మరణం దేవునివలన కలిగిందికాదు. జీవులు నాశంగావడం చూచి ఆయన సంతోషించడు" అని వ్రాసాడు– 1, 13 కనుక మరణానికి పాత్రుడైన నరుడు జంతువు నర్పించి తాను తప్పించుకోవడంగాదు ఇక్కడ విషయం. ఆ జంతువు నెత్తురులోనున్న ప్రాణం దేవుని దగ్గరనుండి వచ్చిందిగాన, ఆ నెత్తురును దేవుని సన్నిధిలో చిలకరించడం ద్వారా నరుడు పాపవిమోచనం పొందాడు, అంతే.

46. పాపికి బదులుగా క్రీస్తు చనిపోయాడా?

పూర్వవేదంలో పాపికి బదులుగా బలిపశువు అర్పింపబడింది అని వాదించేవాళ్ళ నూత్న వేదంలో పాపికి బదులుగా క్రీస్తు చనిపోయాడు అని వాదిస్తారు. పాపంవల్ల మనమే మరణశిక్ష పొందాల్సింది. కాని మన తరపున, మనకు బదులుగా, మన స్థానంలో, క్రీస్తు చనిపోయాడు. కనుక అతని మరణం మన మరణాన్ని తప్పించింది. అతని చావు మన పాపాలను పరిహరించదు, కప్పివేస్తుంది. - ఇది వీళ్ళ వాదం. కాని ఈ వాదం గూడ నిలువజాలదు.

క్రీస్తు మనకు బదులుగా చనిపోలేదు. మరి మనతో ఐక్యమై, మనలను తనయం దిముడ్చుకొని చనిపోయాడు. కనుక అతని మరణం ఒకరీతిగా మన మరణం కూడ. ఈ భావాన్ని హేబ్రేయ పత్రికాకర్త చక్కగా వ్యక్తంచేసాడు. పరిశుద్ధపరచేవాడు క్రీస్తు. పరిశుద్ధపరచబడేవారు నరులు. వీళ్ళిద్దరూ ఒకే మానుషకుటుంబానికి చెందినవాళ్ళు. కనుక అతడు వారిని సోదరులు అని పిలుస్తాడు. అందుకే అతడు దేవదూతల కుటుంబంలో