పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలంలో నెలకొంటుంది - యెహె 43,2. ఆ ప్రజలూ మళ్ళా దేవునితో ఐక్యమౌతారు. దేవుని ప్రజలౌతారు. ఈ విధంగా ప్రజలను, దేవాలయాన్ని గూడారాన్ని పీఠాన్ని పాపం నుండి శుద్ధిచేసి పవిత్రపరచడం కోసం పూర్వవేద ప్రజలు ప్రాయశ్చిత్త కర్మలను జరిపేవాళ్లు ప్రభువు మనలనూ నిత్యం పాపాన్నుండి శుద్ధి చేస్తుండాలని మనవి చేద్దాం.

43. నెత్తురు ఏలా ప్రాయశ్చిత్తం చేస్తుంది?

“రక్తంలో ప్రాణం వుంటుంది. కనుక అది ప్రాయశ్చిత్తం చేయడానికి ఉపయోగపడుతుంది" అంటుంది లేవీ 17,11. ప్రాణి ప్రాణం నెత్తురులో వుంటుంది. అందుచేత నెత్తురు ప్రాణం. ప్రాణం దేవునిదగ్గర నుండి వస్తుంది. కనుక నెత్తురులో ఒక విధంగా దేవుడు నెలకొనివుంటాడు. అది దివ్యమైంది. కనుక నెత్తురు నరుజ్జీగాని, మందిరాన్ని గాని, వేదికను గాని పవిత్రపరచగలదు. ఏ నెత్తురుబడితే ఆ నెత్తురుగాదు. బలిగా సమర్పించబడిన నెత్తురు మాత్రమే ఈలా పవిత్రపరుస్తుంది. దేవుడే యీ నెత్తురును ప్రాయశ్చిత్తం చేయడం కోసం పీఠంపై చిలకరించమని ఆదేశించాడు — లేవీ 17,11. అందుకే యాజకులు దీన్ని పీఠం దగ్గరకు తీసికొని వెళ్ళేవాళ్ళ పీఠంమీద పీఠం ముందూ చిలకరించేవాళ్ళ పీఠం కొమ్మలకు పూసేవాళ్లు, నెత్తురులో రెండు గుణాలుంటాయి. పవిత్రీకరణ గుణం, ఐక్యతా గుణం. కావున అది ప్రజల పాపాలను పరిహరిస్తుంది. ఆ మీదట ప్రజలను దేవునితో ఐక్యపరుస్తుంది. ప్రభురక్తం మన పట్ల ఈ రెండంశాలను సాధించాలని భక్తితో మనవి చేద్దాం.

44. మూడు రకాల బలులు

పూర్వవేదం మూడు రకాల బలులను అర్పించిందన్నాం. అవి పాస్క గొర్రెపిల్ల బలి, నిబంధన బలి, ప్రయాశ్చిత్తబలులు. ఈ మూడు రకాల బలులూ క్రీస్తు సిలువ బలిని సూచిస్తాయి. అనగా క్రీస్తు సిలువబలి ఈ మూడు రకాల బలులనూ సార్ధకం జేస్తుంది. 1. క్రీస్తు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు యెరూషలేం వెలుపల సిలువప్రమానిపై అసువులర్పించాడు. అదే సమయంలో యెరూషలేం దేవాలయంలో పాస్క గొర్రెపిల్లను వధించారు. ఈ సంఘటనవల్ల క్రీస్తు నూత్న వేదప పాస్కగొర్రెపిల్లయని ప్రస్ఫుటమైంది. (2) మోషే కోడెదూడనెత్తురు ప్రజలమీద చల్లి"ఇది యావే మీతో చేసుకున్న నిబంధనరక్తం" అన్నాడు. అదేవిధంగా క్రీస్తుకూడ కడపటి విందు సమయంలో పాత్ర నందుకొని "ఇది నిబంధనరక్తం" అన్నాడు. కనుక సీనాయి నిబంధనం కల్వరి నిబంధనను సూచిస్తుంది. (3) పూర్వవేద ప్రాయశ్చిత్త బలుల్లో నెత్తురు చిలకరించడం వల్ల పాపం పరిహారమైంది అన్నాం. అలాగే క్రీస్తు చిందించిన నెత్తురువల్లగూడ పాపం పరిహారమైంది. అందుకే ప్రభువు "ఇది పాపపరిహారంకోసం చిందబడే నిబంధన రక్తం" అంది - మత్త 26,28. కనుక ఈ ప్రాయశ్చిత్త బలులూ సిలువబలిని సూచిస్తాయి.