పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుట్టలేదు. మనుజకుటుంబంలో జన్మించాడు. ఈలా జన్మించి అన్ని విషయాల్లోనూ తన సోదరులవంటి వాడయ్యాడు. వాళ్ళ పాపాలకు పరిహారం చేసాడు. అతడు నాడు శోధనలకు గురియై శ్రమలను భరించాడు గనుక, ఈనాడు శోధనలు పొందుతూ శ్రమ లనుభవిస్తున్న మనకు సహాయం చేయగలడు - 2, 11. 16-18. ఈ భావాల ప్రకారం క్రీస్తు కేవలం మనకు బదులుగా మన తావులో చనిపోలేదు. అతడూ, మనం పరస్పర సంబంధంలేని వేరువేరు వ్యక్తులంగాము. అతడు మన మానుషకుటుంబంలో పుట్టి, మనలను తనతో ఐక్యం జేసికొని, మనలను తనలో ఇముడ్చుకొని చనిపోయాడు. అందువల్లనే అతని రక్షణం మనకు లభించింది. క్రీస్తు మనకు బదులుగా కాదు, మనకొరకు చనిపోయాడు. అనేభావాన్ని అర్థంచేసుకొని మననం జేసుకుందాం.

47. సాముదాయక వ్యక్తులు

పూర్వవేదంలోని తొలి ఆదాము నూత్నవేదంలోని మలిఆదాము (క్రీస్తు) కేవలం వ్యక్తులు మాత్రమేగాదు, సాముదాయక వ్యక్తులు గూడ. అనగా ఆ తొలి ఆదాము ఏవ భర్తయైన ఓ ప్రత్యేకవ్యక్తి మాత్రమేగాదు. మానవ సముదాయాన్నంతటినీ తనలో ఇముడ్చుకున్న సాముదాయక వ్యక్తి ఉదాహరణకు ఆదికాండ 1,27లో దేవుడు "మన పోలిక ప్రకారం ఆదామును చేద్దాం" అనుకుంటాడు. ఈ యాదాము ఏవభర్తయైన ఆదాముమాత్రమే గాదు. నరజాతికూడ కనుకనే తొలిఆదాము సాంఘికవ్యక్తి అన్నాం. ఆ యాదాము పాపం జేసినప్పడు మనల నందరినీ తనలో ఇముడ్చుకొనే వున్నాడు. మనమూ అతనిలో వుండి పాపం చేసాం. కనుకనే అతని పాపం మనకు సంక్రమించింది.

ఇక, రెండవ ఆదామైన క్రీస్తుకూడ నరజాతిని తనలో ఇముడ్చుకున్న సాముదాయకవ్యక్తి. అతడు శ్రమలనుభవించి చనిపోయినపుడు మనమూ అతనిలో ఇమిడివున్నాం; అతనిలో నెలకొనివుండి అతనియందు శ్రమలనుభవించి చనిపోయాం. కనుకనే అతని రక్షణం మనకూ లభించింది. ఎఫెసీయులు 4,13 లో "క్రీస్తు శరీరం" అంటే తలయైన క్రీస్తూ, అవయవాలైన క్రైస్తవ ప్రజలూను. కావననే క్రీస్తుకూడ సాంఘికవ్యక్తి కనుక ఇద్దరాదాములు సాముదాయకవ్యక్తులనే ఈ భావంకూడ, క్రీస్తు కేవలం మనకు బదులుగా చనిపోలేదు, మనలను తనలో ఇముడ్చుకొని మన ప్రతినిధిగా చనిపోయాడనే రుజువుచేస్తుంది. లూథరు అతని యనుయాయులు బోధించినట్లు క్రీస్తు మన పాపాలను కప్పివేసాడని చెప్పగూడదు. పరిహరించాడని చెప్పాలి.

48. బాధామయ సేవకుడు - యెష53.

పూర్వాంశాల్లో పూర్వవేద బలులను గూర్చి విచారించాం. పూర్వవేదబలులు క్రీస్తు బలని సూచించాయన్నాం. అలాగే పూర్వవేదంలోని కొందరు వ్యక్తులుగూడ తమ