పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాతబడగా ప్రభువు వారిని కాపాడాడు. నాల్గవ గుంపువాళ్లు సముద్రయానం చేస్తూ తుఫానులో చిక్కుకోగా యావే వాళ్ళను గట్టు చేర్చాడు. అతడు ఆ నాలు వర్గాలవాళ్ళ కష్టాలు తొలగించి వాళ్ళ జీవితం సుఖమయం చేసాడు. పై నాల్గవర్గాలవాళ్ళ తమ శ్రమల్లో దేవునికి మొరపెట్టినట్లుగా నేడు మనం కూడ మన యిక్కట్టల్లో అతన్నివేడుకోవాలి.

108. ఆపత్కాల ప్రార్ధన

ఈ కీర్తనలో భక్తుడు మొదట దేవుణ్ణి స్తుతించాడు. ప్రభూ! వివిధ జాతుల నడుమ నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్పకొన్నాడు. ఆ పిమ్మట నీ భక్తులను రక్షించమని దేవునికి విన్నపం చేసాడు. ఏదో యుద్ధానికి ముందు చేసిన మనవి యిది. కీర్తనకారుడు కోరినట్లే ప్రభువు ప్రజలకు యుద్ధంలో సాయం చేసాడు. దేవుడు మన పక్షానవుంటే మనం జీవిత సమస్యలనే యుద్దాల్లో శార్యంతో పోరాడవచ్చు, వాటినుండి బయటపడవచ్చు గూడ.

109. శత్రువులమీద ఫిర్యాదు

భక్తుడు తన శత్రువులమీద ఫిర్యాదుచేస్తూ దేవునికి చేసిన ప్రార్ధన యిది. తనకు కీడు తలపెట్టిన ప్రధానశత్రువు సర్వనాశం కావాలని అతడు దేవునికి మొరపెట్టాడు. అతని మీద శాపాలు కురిపించాడు. తనకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకొన్నాడు. శత్రువుని ద్వేషించవద్దనే నూత్నవేద బోధకు వ్యతిరేకంగా పోతుంది కనుక ఈ కీర్తనను దైవార్చనలో చేర్చలేదు.

110. రాజూ యాజకుడూ ఐన మెస్సీయా

ఇది దావీదు వంశంలోని ఒకానొకరాజు పట్టాభిషేకానికి వ్రాసిన గీతం. కనుక రాజకీర్తన. మెస్సీయాకు గూడ వర్తించేది. ఈ గీతంలో కవి రాజుకి రాజు, యాజకుడు, న్యాయాధిపతి అనే మూడు బిరుదాలు వాడాడు. అతడు అభిషేకం పొందిన దినాన్నే యావే అతన్ని తన కుమారునిగా స్వీకరించాడు. దేవునికి యిస్రాయేలు రాజకీ మధ్య తండ్రీ కొడుకుల సంబంధం వుండేది. అతడు రాజుగా యావే కుడిప్రక్కన ఆసీనుడయ్యాడు. ఆ రాజు లేవీ వంశక్రమంలో గాక మెల్కీసెడెకు క్రమంలో యాజకుడు. నూత్నవేద రచయితలు ఈ రాజకీర్తనను క్రీస్తుకి అన్వయించారు. క్రీస్తు ఉత్థానమై తండ్రి కుడిపార్యాన ఆసీనుడైన రాజు, మెల్కీసెడెకు క్రమంలో యాజకుడు. లోకాంతంలో న్యాయాధిపతిగా విచ్చేసేవాడు. ఆ ప్రభువుకి మనం జోహారులర్పించారు.

111. ప్రభువు కళ్యాణగుణాలు

ఈ కీర్తన ప్రభువు నెరవేర్చిన రక్షణ కార్యాలనూ అతని కళ్యాణగుణాలనూ కీర్తిస్తుంది. ప్రభువు తాను చేసిన నిబంధనకు కట్టుబడి వుండేవాడు. కనుక నమ్మదగినవాడు.