పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97. ప్రభువు విజయం


రాజైన ప్రభువు చాల విజయాలు సాధించాడు. సర్వేశ్వరుడు మల్లా తన ప్రజలను సందర్శించడానికి వస్తున్నాడు. అతడు పూర్వం సీనాయి కొండమీద దర్శనమిచ్చిన ప్రభువులాగ భయంకరుడుగా కన్పిస్తాడు. మన దేవుడు దయా, శక్తి కలవాడు. మనం అతన్ని తలంచుకొని ఆనందించాలి.


98. లోకానికి న్యాయాధిపతి


ప్రభువు రాజుగా, రక్షకుడుగా, న్యాయాధిపతిగా వేంచేయనున్నాడు. యిస్రాయేలీయులు క్రొత్త పాటతో ప్రభువుని ఆహ్వానించాలి. భూమి, సముద్రం, నదులు, పర్వతాలు మొదలైన ప్రకృతి శక్తులన్ని కూడ అతన్ని ఆహ్వానించాలి. యావే ప్రభువులాగే క్రీస్తుకూడ రక్షకుడుగా వేంచేస్తాడు. భక్తులు అతన్ని ఆనందంతో ఆహ్వానించాలి.


99. నీతిమంతుడూ పవిత్రుడూ ఐన దేవుడు


ప్రభువు పవిత్రుడైన రాజు. అతడు దేవదూతల బొమ్మలుకల మందసంపై, సింహాసనం మీద రాజులాగ ఆసీనుడయ్యాడు. యిప్రాయేలీయులు అతన్ని ఆరాధించాలి. పూర్వం మోషే అహరోను, సమావేలు అనే భక్తులు అతనికి ప్రార్థన చేసారు. అతనిలోని ё. గొప్పగుణం పవిత్రత. అలాంటి మహాప్రభువుని మనం కూడ వందించాలి.


100. దేవుని స్తుతించడానికి రండి


ఓ యాత్రిక బృందం ప్రభుని స్తుతించడానికి దేవాలయానికి వచ్చింది. వాళ్లు స్తుతికీర్తనలతో దేవాలయంలో ప్రవేశించారు. సృష్టికర్త, నిబంధన కారుడూ ఐన దేవుణ్ణి కొనియాడారు. అతని ప్రేమ విశ్వసనీయత కలకాలం వుంటాయని కీర్తించారు. ప్రభువు కల్యాణ గుణాలు కలవాడు. అతని గొప్పతనానికి అతన్ని ఎల్లవేళల వినుతించాలి.


101. ఆదర్శంతుడైన రాజు


ఈ కీర్తనలో ఒకానొక యిస్రాయేలురాజు తాను భక్తిగా జీవించి ప్రజలను న్యాయసమ్మతంగా పరిపాలిస్తానని దేవుని యెదుట బాసచేస్తున్నాడు. అతనిబాస యిది. తాను విశుద్ధుడుగా జీవిస్తాడు. చెడ్డను అంగీకరింపడు. కపటాత్మలను పొగరుబోతులను కల్లలాడువారిని తరిమికొడతాడు. మంచివారిని మాత్రమే తన కొలువులో సేవలు చేయనిస్తాడు. దుర్మారులను దేశంనుండి వెళ్లగొడతాడు. ఈ కీర్తనకారునిలాగే మనం కూడ ఓ ప్రవర్తన నియమావళిని రూపొందించుకొని దాని ప్రకారం జీవిస్తే ఎంత బాగుంటుంది!