పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. భద్రంగా కాపాడతాడు

క్రీస్తు మనలను తనతో వుంచుకొని భద్రంగా కాపాడాలనే పితకోరిక. కనుకనే ప్రభువు "నీవు నాకు అనుగ్రహించినవారిని నేను నీ పేరట కాపాడాను" అన్నాడు - యోహా 17, 12 కడకు యూదా భ్రష్టుడైపోయినపుడుగూడ అతడు "నీవు నాకు అప్పగించిన వాళ్లందరిని భద్రంగా కాపాడాను. నాశమైపోయేవాడు ఒక్కడుదప్ప మిగతావాళ్లివరూ జారిపోలేదు" అని తండ్రితోజెప్పాడు - 17, 12 ఈలా మనం క్రీస్తుచే కాపాడబడేవాళ్లం. అతనికి చెందినవాళ్లం. కనుక మన మనుగడ వ్యర్ధమైపోదు.

4. మన సహకారంగూడ అవసరం

ఈ పిలుపులో మన సహకారమనేదిగూడ వుంది. కొందరు దైవపిలుపును కాదన్నారు. ధనికయువకుడు ప్రభువు పిలుపును నిరాకరించాడు, విచారంతో వెళ్లిపోయాడు - మత్త 19,22. ఇంకా, క్రీస్తు పిలిచినవాళ్లల్లో ఒకడు తండ్రిని పాతిపెట్టి రావడానికివెళ్లాడు. మరొకడు బంధువులవద్ద సెలవుతీసుకొని వస్తానని వెళ్లాడు. కాని వాళ్లిద్దరూ మళ్లా తిరిగిరానేలేదు — లూకా 9,59-62 ఈలాంటివాళ్లంతా ప్రభువు పిలుపుకి యోగ్యులుకారు. ప్రభువు ఎవరిని నిర్బంధం చేయడు. బుద్ధిపూర్వకంగా అంగీకరించినవాళ్లనేగాని అతడు తన శిష్యులను జేసికోడు. కనుకనే అతడు ధనికయువకునితో "బాబూ! నీవు పరిపూర్ణుడవ కాగోరినట్లయితే వచ్చి నన్ను వెంబడించు" అని అన్నాడు - మత్త 19,21. ఎప్పడూ కొంతమంది ప్రభువు పిలుపును పెడచెవిని బెడుతూనేవుంటారు. మనం కూడ ఈలాంటి అకార్యానికి పాల్పడవచ్చు. పిలవబడినవాళ్లేమో చాలామందిగాని, ఎన్నుకోబడేవాళ్లుమాత్రం కొద్దిమందే - మత్త22,14. కనుక మన తరపున మనం జాగ్రత్తగా మెలగాలి. దేవుడిచ్చిన పిలుపును భయభక్తులతో కాపాడుకోవాలి.

5. ప్రభుమార్గాలు అగమ్యాలు

ఐనా ప్రభువు మనలను ఎన్నుకొన్నాడు. ఎందుకు? ఇతరులను ఎన్నుకొన్నట్లయితే వాళ్లు ఇంకా అధికంగా భగవంతుణ్ణి ప్రేమించేవాళ్లేమో! తోడిజనానికి ఇంకా అధికంగా సేవలు చేసేవాళ్లేమో! ఐనా ప్రభువ మనలనే ఎన్నుకొన్నాడు అంటే, అది మన గొప్పేమీకాదు. కేవలం ఆ పరమాత్ముని కరుణ. "తన సంకల్పంద్వారానే" -మరి దానికి తిరుగులేదు. "ప్రభుమార్గాలు అగమ్యాలు" - రోమా 11.33. ఈలాంటి సందర్భంలో వినయంతోను భక్తిభావంతోను తలవంచి ఆ ప్రభువుకి మొక్కుకోవడందప్ప మనం చేయగలిగిందేముంది?