పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు యేసుసభ సభ్యులు ఈ యాత్మశోధనలను ఎల్లకాలమూ విధిగా పాటించాలని నియమంచేసాడు. వ్యాధిగా వున్నపుడు ధ్యానమైనా మానివేయవచ్చు గాని, ఆత్మశోధనం మానివేయగూడదని ఆజ్ఞచేసాడు. పరిశుద్ధాత్మ అపరిశుద్ధాత్మ మన మిూద పనిచేసే తీరును అనుభవ పూర్వకంగా తెలిసికొన్న భక్తుడతడు.

6. దేవుడే భక్తులను నడిపిస్తాడు

25. ఇంతవరకు ఇగ్నేప్యసు అనుభవాలను పరిశీలించాం, ఇక, పరిశుద్దాత్మా దుష్టాత్మా మనలను నడిపించే తీరునకు బైబులు నుండి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకోమారు భగవంతుని పిలుపు చాల స్పష్టంగా విన్నిస్తుంది. ఇక సందేహమంటూ వుండదు, కనుక భక్తుడు భగవంతుణ్ణి అనుసరిస్తాడు. ఉదాహరణకు, ప్రభువు సుంకపు మెట్టవద్ద కూర్చుండివున్న మత్తయిని పిలువగా అతడు లేచి క్రీస్తుని అనుసరించాడు- మత్త 9,9. అలాగే ఉత్థాన క్రీస్తు డమస్కు త్రోవనుండి పౌలును పిలువగా అతడు వెంటనే ప్రభు శిష్యుడయ్యాడు - అ.చ.8,4. ఈ పిలుపుల్లో సందేహానికి ఆస్కారంలేదు. కాని ఈలాంటి పిలుపులు చాల అరుదుగా గాని లభింపపు. కొన్నిసారులు ప్రభువు పిలుపు అంత స్పష్టంగా వుండదు గూడ. ఏంచేయాలో, ఏలాచేయాలో తెలియదు. బోలెడన్ని సందేహాలు కలుగుతాయి. ఈలాంటపుడు భక్తుడే ఆ సందేహాలను నివారించుకోవాలి. ఓ ఉదాహరణం. ప్రభువు అవివాహితయైన మరియను మెస్సీయాకు తల్లివి కమ్మని కోరాడు. ఆమె వినయంతో ఇదేలా సాధ్యపడుతుందని అడిగింది. ఆమె పురుష ప్రయత్నంతో గాదు, దైవశక్తితో బిడ్డను కంటుందని వివరించాడు దేవదూత - లూకా 1,28–34. ఇక్కడ మరియు సందేహ నివృత్తి చేసికొంది. ఈలా భగవత్రబోధాలను గూర్చిన సందేహాలను నివృత్తి చేసికొనే బాధ్యత మనమిదనే వుంటుంది. 26. మత్తయి పౌలులకూ మరియకూ విన్పించిన పిలుపు అసాధారణమైంది. మన జీవితంలో అసలు ఈలాంటి పిలుపే విన్పించదు. మామూలుగా ఆ ప్రభువు మన అంతరాత్మలో మాటలాడుతూ మనలను నడిపిస్తూంటాడు. మన హృదయంలో ఓ విధమైన ప్రబోధం కలిగించి మనమేమి చేయాలో చెపూంటాడు. ఐనా భగవంతుడు కలిగించే ఈ ప్రబోధం మనకు స్పష్టంగా తెలిసిరాదు. చాల అనుమానాలూ శంకలూ వుండిపోతాయి. ఈలాంటి పరిస్థితుల్లో తెలియక ఒకోమారు మనం పొరపాటు చేయడం గూడ కదు. ఉదాహరణకు, పౌలు మంచిపనే చేస్తున్నాననుకొని క్రైస్తవులను హింసించాడు. క్రైస్తవులను బాధిస్తే తానింకా అధికంగా యూదభక్తుణ్ణి ఔతాననుకొన్నాడు. తరువాత తాను చేసింది తప్పని తెలిసికొని పశ్చాత్తాపపడ్డాడు. అటుతరువాత క్రీస్తుని ఆధారంగా తీసికొని గాని