పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యౌతాడు. ఐనా ప్రజలు ఆ తండ్రి మాట మీరారు - ద్వితీ 32,8. అతడు వారికి తల్లి, తల్లి ప్రేవున బుట్టిన బిడ్డను మరచిపోతే మరచిపోతుందేమోగాని ప్రభువు మాత్రం ఆ ప్రజను విస్మరింపడు - యెష 49, 15. తల్లిపక్షి పిల్లలను తన రెక్కలమీద మోసికొని పోయినట్లే ప్రభువుకూడ ఆ ప్రజలను నడిపించుకొని పోయాడు - ద్వితీ 32,11. ఐనా యిస్రాయేలు ప్రజలు ఈ తల్లి మాట జవదాటారు.

ఒడంబడిక ద్వారా యావే వరుడూ యిస్రాయేలు ప్రజ వధువూ ఔతారు. కాని ఈ వధువు యావేను విడనాడి అన్యులతో పాపం చేసింది. మళ్ళా యావే వద్దకు తిరిగి రావడానికి నిరాకరించింది - యిర్మీ 3, 6–7. అనగా పాపం చేయడం భార్య భర్తను త్యజించి తప్పతోవలు తొక్కడంలాంటిదనీ, బిడ్డ తల్లిదండ్రులను ధిక్కరించడం లాంటిదనీ భావం. కనుక ప్రవక్తల దృష్టిలో, పాపమంటే నరుడు భగవంతుని ప్రేమను నిరాకరించడం. భగవంతుడు నరుని ప్రేమను పొందలేక బాధపడ్డం. ఈ భావాలన్నీ నూత్నవేద ప్రజలమైన మనకూ అక్షరాలా వర్తిస్తాయి.

19. నీవు మానుండి నీ ముఖాన్ని మరుగుచేసికున్నావు - యెష 64, 6-12

యెషయా ప్రవక్త పాపాన్ని చాలా వుపమానాలతో పోల్చి చెప్పాడు. పాపం వల్ల నరులు అపవిత్రుల్లాగ, అనగా కుష్టరోగుల్లాగ తయారయ్యారు. వాళ్ళ నీతిక్రియలన్నీ కుష్టరోగి ధరించే మురికిబట్టల్లా వున్నాయి. ఎండిన ఆకులు సుడిగాలికి కొట్టుకొని పోయినట్లే నరులు స్వీయ పాపాలవలన కొట్టుకొని పోతున్నారు. ప్రభువు ప్రజలను రోసి, వాళ్ళనుండి ముఖం మరుగుచేసికున్నాడు.

ప్రభువు యిస్రాయేలు ప్రజలను కలిగించినవాడు. వారికి తండ్రి లాంటివాడు. కుమ్మరి కుండలను చేసినట్లే ప్రభువుకూడ తన ప్రజలను కలిగించాడు. వారు అతని సృష్టి, ఆయన చేతి పని. ఐనా ఆ జనులు మూరులై ప్రభువునకు కోపం తెప్పించారు. కనుక అతడు వారిని విస్మరించాడు. దానితో యెరూషలేం పాడుపడింది. సియోను బీడు వడింది. దేవాలయం మంటగలిసింది. పూర్వవేదం పాపాన్ని వర్ణించే ఆవేదనా ఘట్టాల్లో యిదీ వొకటనాలి!

20. నీ కోపంవల్ల మేము క్షీణించిపోతున్నాం - కీర్త 90,7

ప్రవక్తలకు పాపం ఓ మోయలేని బరువులా తోచింది. అపవిత్రుడైన నరుడు పవిత్రుడైన భగవంతుణ్ణి ధిక్కరించి పాపంచేయడమనేది భరింపరాని విషయమనిపించింది. "నా దోషాలు నా తలమీదుగా పొర్లిపారాయి. మోయలేని బరువులాగ నా తలమీద మోపబడ్డాయి" అంటాడు ఓ కీర్తనకారుడు - 38,4, "దివారాత్రాలూ నీ చేయి నామీద బరువుగా వ్రాలింది. వేసవికాలపు మడుగులాగ నా లోని సారం ఒట్టిపోయింది. ప్రభూ నా దోషాన్ని కప్పిపుచ్చుకోకుండా నీ యెదుట ఒప్పకుంటున్నాను" అంటాడు మరో