పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. పాము స్త్రీని ప్రశ్నించింది.

పాము స్త్రీనిచూచి "మీరు తోటలోవున్న ఏచెట్టు పండూ తినగూడదట నిజమేనా? అని ప్రశ్నించింది- 3,1. ఏవ పిశాచాన్ని చూడగానే దాన్ని తరిమివేయవలసింది. పిశాచంతో ఎవరూ సంభాషణకు దిగకూడదు. కాని ఈ తెలివి ఏవకు లేదు. పైగా పిశాచం వట్టి అబద్దాలకోరు. కనుకనే "జ్ఞానవృక్షం పండ్లు తిన్నా మీరు చావనే చావరు" అని చెప్పింది. ఏవ ఆమాటలు గట్టిగా నమ్మకొంది. ఆమె మందబుద్ధినిచూచి పిశాచం మరింత రెచ్చిపోయి “దేవుడు వట్టి అసూయాపరుడూ, స్వార్థపరుడూను. నరులుకూడ తనంతటివాళు ఔతారేమోనన్న భయంతో జ్ఞానవృక్షఫలం తినవద్దని శాసించాడు సుమా" అని చెప్పింది. ఆ మాటలు వినేటప్పటికి ఏవకు ఆశపుట్టింది. తానూ మంచిచెడ్డలు తెలిసికొని దేవుడంతటిది కావచ్చుగదా అనుకొంది. ఇకనేం. పండును కోసి తింది. ఆదాము చేతగూడ తినిపించింది.

ఈవిధంగా ఆదిదంపతులిద్దరూ పిశాచం వలన పతనమైపోయారు. పిశాచానికి నరజాతి అంటే గిట్టదు. తాను పోగొట్టుకొనిన భాగ్యదశను ఈ నరులు పొందారు. కనుక నరజాతిని ఏలాగైనా కూల ద్రోయాలనే దానికోరిక. సొలోమోను జ్ఞానగ్రంథం "భగవంతుడు నరుడ్డి అమరుడ్డిగా సృజించాడు. కాని పిశాచం అసూయ వలన మరణం లోకంలో ప్రవేశించింది. కనుక ఆ పిశాచం పక్షానికి చెందినవాళ్ళంతా నేటికీ చావును చవిచూస్తూనే వున్నారు" అంటుంది –2, 24.

దేవుడు నిషేధించిన పండు స్త్రీకి కన్నులపండువుగా వుంది. ఆమెకు దాన్ని తింటే యెంత రుచిగా వుంటుందో అనే వుబలాటం పుట్టింది - 8,6. పాపపు క్రియ ఎప్పడూ ఈలాగే వుంటుంది. సీరా జ్ఞానగ్రంథం "పాపం స్త్రీతో ప్రారంభమైంది. ఆమెవలన మనమంతా నాశమై పోయాము" అని చెప్మంది - 25,24.

దేవుడు వలదన్న పండును తినగానే ఆదిదంపతులకు కనువిప్ప కలిగింది. వాళ్ళు తాము దిసమొలతో వున్నట్లు తెలిసికొని అంజూరపుటాకులు కుట్టి మొలకు కప్పకొన్నారు — 3,7. పూర్వాధ్యాయంలో రచయిత ఆదిదంపతులు మొండిమొలతోవున్నా వాళ్లకు సిగ్గు వేయలేదు అన్నాడు - 2,25, కానీ ఇక్కడ సిగ్గువేసింది అని చెప్పాడు. భావం ఇది. పాపం వాళ్లల్లో దోషశంకను పట్టించింది. వాళ్ల నిష్కల్మషత్వం పోయింది. ఆదిమానవులు పాపానికి లొంగిపోయారు. వాళ్లల్లో ఆశాపాశాలూ వ్యామోహాలు పుట్టుకవచ్చాయి. జంతువాంఛలు మోసులెత్తాయి. కనుకనే వాళ్లు ఒకరి లింగాన్ని చూచి ఒకరు నిగ్రహం కోల్పోయారు. సిగ్గు చెందారు. అనగా పాపం వలన వాళ్లల్లో పెద్దమార్పు కలిగింది. ఇక దేహం వాళ్ల అదుపులో వుండదు.