పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. మంచి సెబ్బరలను తెలియజేసే చెట్టు

ఏదెను తోటలో మంచి సెబ్బరలను తెలిసికొనే శక్తినిచ్చే చెట్టు కూడ వుంది - 2, 9. దాని పండ్లు తింటే నరులకు వెంటనే మంచి సెబ్బరలను తెలిసికొనే తెలివి కలుగుతుంది. మంచి సెబ్బరలను తెలిసికొనే శక్తినిచ్చే చెట్టు అనడం కూడ ఓ సంకేతం. ఇక్కడ మంచి సెబ్బరలు తెలిసికొనే పూర్తిజ్ఞానం అని భావం. జ్ఞానమంటే పుస్తకజ్ఞానం కాదు. జీవితంలో మనకు ఏది అవసరమో తెలిసికొనే క్రియాజ్ఞానం. అనగా మన మంచినీ, మన అవసరాలనూ నిర్ణయించుకొనే జ్ఞానం. కాని మన మంచినీ మన అవసరాలనూ మనమే నిర్ణయించుకొంటున్నామంటే, మనం స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నామని భావం. కనుక ఈ జ్ఞానవృక్షం పండ్లు తింటే నరుడు స్వతంత్రంగా ప్రవర్తించడ మౌతుంది. దేవుని మీద ఆధారపడకుండా వుండడ మౌతుంది.

ప్రభువు ఆదాముతో 'మీరు తోటలోవున్న పండ్లన్ని తినవచ్చగాని మంచి సెబ్బరలను తెలియజేసే చెట్టు పండ్లను మాత్రం తినకూడదు” అన్నాడు - 2, 16-17, అంటే ఆదిదంపతులు ఏమైనా చేయవచ్చుగాని, స్వతంత్రంగా ప్రవర్తించడం మాత్రం కూడదని భావం. వాళ్లు దేవుని మీద ఆధారపడి జీవిస్తుండాలని అర్థం.

భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు. అతని మీద మరోశక్తి పని చేయదు.కాని నరుడు ఆలాకాదు. అతడు పరతంత్రుడు. దేవుని మీద ఆధారపడి జీవింపవలసినవాడు. ఐనా ఆదాము స్వతంత్రుబ్లాగ ప్రవర్తింప బోయాడు. అది అతని గర్వం,

5. శోధనలూ, పతనమూ

1. జిత్తులమారి పాము

ఏవను శోధించడానికి వచ్చిన పిశాచం పామరూపంలో వుంది — 3.1. పిశాచం పాము రూపంలో వచ్చింది అనడం దేనికి? పాముకంటె నక్క ఇంకా జిత్తులమారిది కదా? ఇక్కడ గ్రంథకర్త పామును ఎన్నుకోవడంలో ఉద్దేశం యిది. పామంటే నరులందరికీ అసహ్యమూ భయమూను. పైగా ఆ కాలంలో యిస్రాయేలీయులకు సోదరజాతులైన కనానీయులు ఫిలిస్ట్రీయులు మొదలైన వాళ్లంతా పామును ఆరాధించేవాళ్లు, ఇంకా, లింగానికిగూడ పాము చిహ్నంగా వుండేది. ఆకాలపు ప్రజలు కొందరు సర్పపూజా నెపంతో లైంగికంగా అత్యాచారాలు చేసేవాళ్లు, ఈ కారణాలచేత యిస్రాయేలు ప్రజలకు పాము అసహ్యకరమై పోయింది. కనుక గ్రంథకర్త పామును ప్రదర్శించడంలో పిశాచం ఎంతో అసహ్యకరమైన ప్రాణి అని చెప్పాడు.