పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాలోమోను జ్ఞానగ్రంథం

ఎవడో అనామక రచయత క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో ఈ పుస్తకాన్ని సొలోమోను పేరుమీదిగా వెలువరించాడు. మామూలుగా యూదులకు గ్రీకు సంస్కృతి గిట్టదు. కాని ఈ రచయిత గ్రీకు సంస్కృతికి అలవాటుపడిన యూదుడు. గ్రీకుల భావాన్ననుసరించి యితడు నరుడ్డి దేహాత్మలుగా విభజించాడు. జ్ఞాని కష్టాలతో చనిపోయినా మరణంతో అతని జీవం అంతంకాదు. అతని ఆత్మ తర్వాత సుఖాన్ని పొందుతుంది. కనుక జ్ఞానం తప్పకుండా సుఖాన్ని కలిగిస్తుంది. ఇది యీ రచయిత వాదం. ఈ సూత్రం యోబు గ్రంథ రచయితకూ ఉపదేశక గ్రంథ రచయితకూ తెలియదు. వాళ్ళు యూదుల పద్ధతిలో మరణంతో నరుని జీవితం అంతమవుతుందనుకొన్నారు. కనుక లోకంలో సజ్జనులకు కష్టాలెందుకు వస్తాయి అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేక పోయారు. ఈ రచయిత చెప్పగలిగాడు. అది యితని గొప్పతనం. ఈ గ్రంథం జ్ఞానప్రశంసలతో నిండివుంటుంది.

సీరా జ్ఞానగ్రంథం

ఇది జ్ఞాన గ్రంధాలన్నిటిలోను ఎక్కువ సూక్తులు కలిగిన గ్రంథం. చాల నైతికవిషయాలను బోధిస్తుంది. క్రీస్తుపూర్వ రెండవ శతాబ్దంలో బెన్సీరా దీన్ని వ్రాసాడు. యూదులు గ్రీకు సంస్కృతీప్రభావానికి లొంగకుండా వండాలని ఇతని ఆశయం.జ్ఞానగ్రంధాలన్నిటిలోను బహుశః యిది ఎక్కువ ఉపయోగకరమైంది. చాల భక్తిమంతంగా గూడ వుంటుంది.


4. ప్రవక్తలు

ప్రవక్త లేక దీర్ఘదర్శి అంటే మనం భవిష్యత్తును తెలియజేసేవాడు అనుకొంటాం. ఇది ప్రవక్త చేసే పనుల్లో ఒకటిమాత్రమే. ప్రవక్త ప్రధానంగా దేవుని పేరుమీదిగా మాటలాడేవాడు. దేవుని చిత్తాన్ని తెలియజేసేవాడు. తాను దేవుని సందేశాన్ని విని దాన్ని ప్రజలకు విన్పించేవాడు. కనుకనే ప్రభువు తన వాక్యాన్ని తీసి యిర్మీయా పెట్టాడు. యిస్రాయేలు ప్రవక్తలు భగవంతుణ్ణి అనుభవానికి తెచ్చుకొని అతనితో ఐక్యమై జీవించిన మహాభక్తులు. వాళ్ళు దేవుడు యిస్రాయేలు ప్రజలను ఏలా నడవమని అభిలషిస్తాడో, తాను వాళ్ళకు ఏయే మేళ్లు చేయాలని కోరుకొంటాడో అర్థంచేసికొని ఆ ప్రభువు చిత్తాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూండేవాళ్ళు ప్రజలను దేవుని మార్గాల్లో నడవమనీ దేవునికి లొంగమనీ హెచ్చరిస్తుండేవాళ్ళు కనుక వాళ్ళు దేవుని చేతిలో ఉపకరణం లాంటివాళ్ళు అతని నోటి పలుకులాంటి వాళ్ళు