పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామెతలు

సాలోమోనురాజు మహా జ్ఞాని. అతడు స్వయంగా చాల జ్ఞానవాక్యాలు చెప్పాడు. ఇతరులను పేరేపించి చాల సూక్తులు చెప్పించాడుకూడ. యూదుల ధర్మశాస్త్ర సాహిత్యానికంతటికీ మోషేను కర్తగా భావించినట్లే, జ్ఞాన సాహిత్యానికంతటికీ సొలోమోనును కర్తగా భావించారు. సామెతల గ్రంథం సాలోమోనురాజు పేరుమీదిగా ప్రచారంలోకి వచ్చింది. కాని దీనిలో ఇతరుల రచనలనుగూడ చేర్చారు. ఈ పుస్తకం ఐదవ శతాబ్దంలో రూపుదిద్దుకొంది. పుస్తకమంతా నీతివాక్యాలతో నిండివుంటుంది. ఇవి మన సామెతల్లాగాను, నీతిశతకాల్లోని పద్యాల్లాగాను వుంటాయి. జ్ఞానం పుణ్యం, అజ్ఞానం పాపం. జ్ఞానంతో జీవించేవాడు సుఖశాంతులు అనుభవిస్తాడు. అజ్ఞానంతో జీవించేవాడు దుఃఖంపాలవుతాడు. ఇది యీ గ్రంథం సారాంశం.

ఉపదేశకుడు

యోబు గ్రంథకర్తలాగే ఈ గ్రంథకర్తకూడ నిరాశావాది. జ్ఞానాన్ని పాటించినంత మాత్రన్నే సుఖశాంతులు కలుగవు. లోకంలో పుణ్యకార్యాలు చేసిన జ్ఞానులు కష్టాలనుభవిస్తున్నారు. దుష్టకార్యాలు చేసిన పాపులు సుఖాలనుభవిస్తున్నారు. మరి న్యాయబద్ధంగా జీవించడంవలన లాభమేమిటి? ఇది యీ రచయిత వాదం. లోకంలోని వస్తువులన్నీ వ్యర్థమైనవే. ఏ వస్తువూ మనకు పూర్ణసుఖాన్నీయలేదు. ఇది యీ రచయిత ముఖ్యభావం. యోబు గ్రంథంలాగే ఈ పుస్తకం గూడ లోకంలో చెడ్డ యెందుకు వుందని ప్రశ్నిస్తుంది. తగిన పరిష్కారం మాత్రం సూచించదు. ఈ పుస్తకం సొలోమోను పేరుమీదిగా వెలువడింది.

పరమగీతం

యధార్థంగా ఈ పుస్తకం జ్ఞానగ్రంథం కాదు. సూలంగా దీన్ని ఈ వర్గం పుస్తకాల్లో చేర్చారు, అంతే. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని వెదకడం, వాళ్ళిద్దరూ కలసుకొని ఆనందించడం ఈ పుస్తకంలో యితివృత్తం. ఈలాంటి పుస్తకం బైబుల్లోకి యెందుకు వచ్చింది? ఈ ప్రేమికుడూ ప్రియురాలూ భగవంతునికీ ప్రజలకీ చిహ్నంగా వుంటారు. యావేప్రభువు యిప్రాయేలు ప్రజను తన వధువునుగా జేసికొని ఆదరించాడు. ఈ సంకేతంవల్ల యూదులు దీన్ని పవిత్ర గ్రంథంగా భావించి పూర్వవేదంలో చేర్చారు. నూత్నవేదంలో ఇది క్రీస్తునీ శ్రీసభనీ సూచిస్తుంది. ఓరిజిన్, బెర్నార్డ్ మొదలైన వేదశాస్తులు ఈ దృష్టితోనే దీనిమీద గొప్పవ్యాఖ్యలు వ్రాసారు. పుస్తకం పాటలరూపంలో వుండి లలితమైన భావాలతో నిండివుంటుంది. ఈ పుస్తకంగూడ సొలోమోను పేరుమీదగానే వెలువడింది.