పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి మహాప్రవక్త మోషే. అతడు యావే ప్రభువు హృదయాన్నీ ఐగుప్త నిర్గమనం భావాన్నీ ప్రజలకు విశదీకరించాడు. సీనాయి కొండ దగ్గిర నిబంధనంద్వారా యిస్రాయేలును దేవుని ప్రజను చేసాడు. తర్వాత సమూవేలు, ఏలియా, ఎలీషా మొదలైన ప్రవక్తలు మోషే సంప్రదాయాన్ని కొనసాగించారు. సీనాయి దగ్గర ప్రారంభమైన యావేమతాన్ని వృద్ధిలోకి తీసుకవచ్చారు. 8వ శతాబ్దంలో ఆమోసుతో మొదలుపెట్టి ప్రవచనమే వృత్తిగాగల ప్రవక్తలు బయలుదేరారు. వీళ్ళ ప్రవచనాలు గ్రంథస్థమై బైబులు పుస్తకాలయ్యాయి.

ప్రవక్తలు స్వయంగా గ్రంథాలు వ్రాయలేదు. వాళ్ళ శిష్యులు తమ గురువుల బోధలను సంకలనం చేసారు. ఈ బోధలకు పరిచయవాక్యాలూ వివరణలూ చేర్చి గ్రంధాలుగా రూపొందించారు. కనుక నేడు మనం ప్రవక్తల గ్రంథాలు అనుకొనేవాటిల్లో కొన్నిభాగాలు మాత్రమే ప్రవక్తల సొంత పలుకులు. ప్రవక్తలు తమ ప్రవచనాలను రకరకాల రూపాల్లో పల్మారు. గేయాలు, వచనాలు, సామెతలు, దైవోక్తులు, పిట్టకథలు, ఉపదేశాలు, కీర్తనలు, విలాపవాక్యాలు, అపహాసవాక్యాలు మొదలైన పెక్కు రూపాల్లో ప్రవచనాలు కన్పిస్తాయి.

ప్రవక్తల్లో యెషయా, యిర్మీయా, యెహెజ్నేలు, దానియేలు అనేవాళ్ళు పెద్ద ప్రవక్తలు. వీళ్ళగాక పండ్రెండుమంది చిన్న ప్రవక్తలు కూడ వున్నారు. నేటి బైబుళ్ళలో ఈ ప్రవక్తల గ్రంథాలు యెషయాతో ప్రారంభమై మలాకీతో ముగుస్తాయి. కాని యిది కాలక్రమ పద్ధతికాదు. విషయ గౌరవాన్ని బట్టి ఈ గ్రంథాలను ఈ క్రమంలో అమర్చారు. ఇక ఒక్కోప్రవక్తను పరిశీలిద్దాం.

పెద్ద ప్రవక్తలు నల్లరు

యెషయా

యెషయా గ్రంథంలో కనీసం ముగ్గురు ప్రవక్తల బోధలయినా కన్పిస్తాయి. దీనిలో 66 అధ్యాయాలున్నాయి. 1-39 అధ్యాయాలు 765–690 సంవత్సరాల్లో యెరూషలేములో జీవించిన యెషయా బోధలు. ఆ కాలంలో అస్పిరియా గొప్ప రాజ్యంగా వృద్ధిచెంది 721 లో ఉత్తరదేశమైన యిస్రాయేలును కబళించింది. దక్షిణరాజ్యమైన యూదా స్వీయ రక్షణకు కొంతకాలం అస్పిరియాతోను కొంతకాలం ఐగుప్తతోను సంధిచేసికొంటూండేది. కాని ఆరోజుల్లో ఏ రాజును ఆశ్రయిస్తే ఆ రాజు దేవుళ్ళను కొలవాలి. కనుక యూదులు అన్యదైవాలను పూజించే ప్రమాదం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో యెషయా ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. అతని బోధల ప్రకారం యిస్రాయేలుకు ఏకైకరాజు యావే. అతడు పవిత్రుడైన ప్రభువు. చరిత్రనంతటినీ నడిపించేవాడు అతడే. యిప్రాయేలు అతన్ని ఆశ్రయించి అతనినుండే విజయం సాధించాలి. అన్యరాజులను ఆశ్రయించ కూడదు.