పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోబూ అతని నల్లురు స్నేహితులూ కలసి ఈ సమస్యకు రకరకాల పరిష్కారాలు సూచించబోతారు. కాని ఏ పరిష్కారమూ తృప్తిని కలిగించదు. కడన ఈ సమస్యను పరిష్కరించకుండానే గ్రంథం ముగుస్తుంది. ఈ పుస్తకాన్ని అర్థం జేసికోవడం కష్టం. కాని ఈ గ్రంథకర్త చాల లోతయిన భావాలు చెప్పాడు. ఇతడు ప్రపంచంలోని మహారచయితల కోవకు చెందినవాడు. ఇతడు యిప్రాయేలు జ్ఞానుల్లో నిరాశావాదుల పక్షాన నిలుస్తాడు. యోబుకథ చారిత్రకమైంది కాదు. నీతిబోధకమైంది.

కీర్తనలు

కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలున్నాయి. ఇవన్నీ జ్ఞానాన్ని బోధించవు. వీటిల్లో కొన్నిమాత్రమే ఆ వర్గానికి చెందుతాయి. ఐనా సామాన్యంగా ఈ గ్రంథాన్ని జ్ఞానవాజ్మయంలోనే చేరుస్తుంటారు.

కీర్తనల గ్రంథం యిస్రాయేలు ప్రజల జపపుస్తకం, సంగీత గ్రంథం. దానిలోని 150 కీర్తనలను దేవళంలో జరిగే ఆరాధనలో గీతాలుగా పాడేవాళ్ళు లేవీయులు వీటిని స్వయంగా దేవళంలో పాడారు, ప్రజలచే పాడించారు.

దావీదురాజు కొన్ని కీర్తనలను వ్రాసాడు. కాని కీర్తనలన్నీ అతడు వ్రాసినవి కావు. దావీదు వ్రాసిన కీర్తనలను అతని తర్వాత వచ్చిన హీబ్రూ రచయితలు అవసరాన్నిబట్టి కొంతవరకు మార్చారు కూడ. కీర్తనల గ్రంథం కాలక్రమేణ పెరుగుతూ వచ్చింది. అది పూర్తికావడానికి కనీసం ఆరువందల యేండ్లయినా పట్టివుండాలి.

ఈ గ్రంథం విలువ దానిలోని ప్రార్థనలను బట్టి వచ్చింది. ఈ పొత్తం సూచించని ప్రార్థనారీతులు లేవు. శతాబ్దాల పొడుగునా నరులు వాడుతూ వచ్చిన ప్రార్థనా పద్ధతులన్నీ 53 పుస్తకంలో ఎక్కడో వో తావులో తగులుతాయి. కనుక భగవదనుభూతిని పొందగోరేవాళ్ళకు ఇది యెంతో వుపయోగపడుతుంది. కష్టసుఖాల్లో నరుడు భగవంతునికి ఏలా ప్రార్ధన చేసికోవాలో ఈ గ్రంథం నేర్పుతుంది.

కీర్తనల పుస్తకాన్ని యూదులు మొదట తమ దేవాలయంలోను, తర్వాత తమ ప్రార్థనా మందిరాల్లోను వాడుకొన్నారు. వారి పద్ధతిలోనే క్రీస్తు కూడ ఈ కీర్తనలను జపించాడు. అవి సూచించే రాజూ, మెస్సీయా అతడే క్రీస్తు తర్వాత క్రైస్తవ సమాజం ఈ పుస్తకాన్ని తన ప్రార్థనా గ్రంథంగా స్వీకరించింది. మరియమాతా, అపోస్తలులూ, తొలి శతాబ్దాల్లోని వేదసాక్షులూ వీటిని జపించారు. నేటికీ తిరుసభలో గురువులూ మఠవాసులూ ప్రతిరోజు జపించే ట్రీవియరీ జపపుస్తకంలో అధిక భాగం కీర్తనలే. పూర్వవేదంలో ఇంత భక్తిమంతమైన గ్రంథం మరొకటి లేదు.