పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెస్సీయా కాలం సమీపించగానే అతడు దైవవాక్కువలన ప్రబోధితుడై యెడారిని వదలి జనుల మధ్యకు వచ్చాడు - లూకా 3,2. శిష్యులను ప్రోగుజేసుకొని వారికి ప్రార్ధనం ఉపవాసం మొదలైన నియమాలు నేర్పించాడు - 5,33. అతడు ప్రజలకు బోధించింది హృదయ పరివర్తనం. పరలోక రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తనం చెందండి - ఇది యోహాను ముఖ్యబోధ - మత్త 3,2. తర్వాత క్రీస్తు కూడ ఈ వాక్యంతోనే తన బోధను ప్రారంభించాడు - 4,17 యోహాను ఈ హృదయ పరివర్తనానికి చిహ్నంగా యోర్గానునదీ స్నానాన్ని ఎన్నుకొన్నాడు. నీళ్లు దేహమాలిన్యాన్ని కడిగివేసినట్లే పశ్చాత్తాపం ఆత్మమాలిన్యాన్ని కడిగివేస్తుందని అతని ఉద్దేశం కావచ్చు. కనుక ప్రజలు అతని యెదుట తమ పాపాలను ఒప్పకొని యోర్తాను నదిలో స్నానం చేసేవాళ్లు - మార్కు 1,5. కేవలం అబ్రాహాము సంతానంగా పడితేనే చాలదనీ, పాప జీవితం వదులుకొని పవిత్రజీవితం గడపాలనీ అప్పడే మెస్సీయా రాజ్యంలో చేరడానికి అరూలమౌతామనీ యోహాను ప్రజలకు బోధించాడు - మత్త 3, 8-9.

కాని పరిసయులూ ధర్మశాస్త్రబోధకులూ యోహాను బోధను అంగీకరించలేదు. వాళ్లు అతనికి దయ్యం పట్టిందనుకొన్నారు — లూకా 7,83. కనుక అతడు వాళ్లను జూచి మండిపడ్డాడు. విషసర్ప సంతానమా! మీరు దైవకోపాన్ని తప్పించుకోలేరు. కనుక హృదయ పరివర్తనం చెందండి. దేవుడు మంచిపండ్లను ఈయని చెట్లను నరికి అగ్నిలో పడవేస్తాడుసుమా అని గర్జించాడు - మత్త 3, 7-10.

యోహాను మహాపవిత్రుడు. పాపాన్ని సహింపనివాడు. అతడు ఆనాటి పాపపు ప్రజలందరినీ నిశితంగా ఖండించాడు - లూకా 3, 10-14. ఆలాగే హేరోదుని కూడ వ్రేలెత్తిచూపాడు. కనుక ఆరాజు అతన్ని చెరలో త్రోయించాడు. కడన చంపించాడు - మత్త 14, 3–10. దేవునిపట్ల దైవరాజ్యంపట్ల ఉన్న ఆసక్తినిబట్టి ప్రజలు యోహానుని నూత్న యేలీయానుగా గణించారు. ఏలీయా తిరిగివచ్చి దేవుని మార్గాన్ని సిద్ధం జేస్తాడని పూర్వం ప్రవక్తలు చెప్పారు - మలా 4.5-6. క్రీస్తుకూడ యోహానుని రానున్న యేలీయానుగానే పేర్కొన్నాడు — మత్త 11,4. కాని యూదులు చాలమంది అతన్ని పట్టించుకోలేదు. అతడు వచ్చి మెస్సీయాకు మార్గం తయారుచేసినా ఆ మెస్సీయాకు సిలువ మరణం తప్పలేదు. - మార్కు 9,11-13.

2. వెలుగుకి సాక్ష్యం పలికేవాడు

యోహాను క్రీస్తుకి సాక్ష్యం పలికాడు. ఆ సాక్ష్యంలోని ముఖ్యాంశం ఇది. అతడు మెస్సీయాకు ముందుగా వచ్చి అతనికి మార్గాన్ని సిద్ధం చేసేవాడు మాత్రమే. తానే మెస్సీయా కాదు. జనుల గుంపు యోహానే మెస్సీయా యేమోనని బ్రాంతి చెందింది. అతడు నేను మెస్సీయాను కాను. అతనికి ముందుగా వచ్చేవాణ్ణి. అతడు నాకంటె అధికుడు. నేను అతని పాదరక్షల వారును విప్పడానికి గూడ యోగ్యుణ్ణి కాను అని చెప్పాడు — లూకా 231