పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేశంలో దేవుడు లేడనా? దీనికి శిక్షగా మీరాజు ఇక పడక మీదినుండి దిగిరాడని చెప్పండి" అన్నాడు. ఇది అతని దైవభక్తి - 2 రాజు 1,6. ఈ దైవభక్తి మనకుగూడ అలవడితే ఎంత బాగుంటుంది!

2.యాకోబు జాబు ఈలా చెప్తుంది. ఏలీయా మనలాంటివాడే. అతడు వానలు కురవకూడదని ప్రార్థన చేస్తే మూడున్నర యేండ్లు వరాలు పడలేదు. మళ్లా వర్షాలు కురవాలని ప్రార్ధన చేస్తే వానలు పడ్డాయి. మన ప్రార్థనకూడ అతని జపంలాగే శక్తితో పనిచేస్తుంది - 5, 16-8. కనుక మనంకూడ భక్తితో జపం చేయాలి.

౩.తబోరు కొండమీద క్రీస్తు దివ్యరూపాన్ని పొందినపుడు ఏలీయా అతనితో సంభాషించాడు - మత్త 17,3. ఇక్కడ యేలీయా పూర్వవేద ప్రవక్తలను సూచిస్తాడు. వాళ్ళ ప్రవచనం క్రీస్తులో కొనసాగుతుందనీ, పూర్వ నూత్న నిబంధనలకు సంబంధముందనీ తెలియజేస్తాడు. ఇంకా, యేలీయా క్రీస్తుతో నెరపిన యీ సంభాషణం పూర్వం అతడు హోరేబు కొండమీద దేవునితో సంభాషించడాన్ని కూడ జ్ఞప్తికి తెస్తుంది - 1రాజు 19,12-13. అతడు దైవానుభూతిని పొందిన మహానుభావుడు కదా! ఆ యేలీయాలాగే మనంకూడ భక్తి భావంతో దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ ప్రభువుతో ఏకాంతంగా, ప్రార్ధనాపూర్వకంగా సంభాషించడం నేర్చుకోవాలి.

7. మోషే

యూదులకు మోషేలాంటి ప్రవక్త మరొకడు లేడు. ప్రభువు అతనిద్వారా యిస్రాయేలీయులకు బానిసం నుండి విడుదలను దయచేసాడు. అతనిద్వారా వారితో నిబంధనం చేసికొని వారికి ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు.

కాని మోషే మధ్యవర్తిత్వం ద్వారా ప్రభువు యిప్రాయేలీయులకు మాత్రమే ధర్మశాస్తాన్ని దయచేసాడు. ఇప్పుడు అతడు తన కుమారుడైన క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా సకల జాతులను రక్షిస్తాడు. మోషేద్వారా ధర్మశాస్త్రం లభించింది. కాని క్రీస్తు మూలాన మనకు కృపాసత్యాలు లభించాయి - యోహా 1,17. మోషే నెలకొల్పిన నిబంధన కంటె క్రీస్తు స్థాపించిన నిబంధనం చాల గొప్పది. మోషేను గూర్చి చాల విషయాలు చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యమైన అంశాలు కొన్నిటిని పరిశీలిద్దాం.

1. ప్రభువు సేవకుడూ, స్నేహితుడూ

ప్రభువు చాలకాలంపాటు యిప్రాయేలీయులను తయారు చేసాకనే మోషేను ఎన్నుకొన్నాడు. అతడు బానిస జాతిలో పట్టాడు. ఫరో కొమార్తె అతని ప్రాణాలు కాపాడింది. ఆమె సహాయంతోనే అతడు విద్యాబుద్ధులు గడించి గొప్పవాడయ్యాడు - అ,చ. 7,21.