పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తర్వాత ఆ వితంతువు కొడుకు చనిపోగా ఏలీయా అతని కొరకు దేవుని ప్రార్థించాడు. ప్రభూ! ఈ బాలునికి ప్రాణాలు మరల వచ్చును గాక అని మనవి చేసాడు. పిల్లవాడు తిరిగి బ్రతికాడు. అతని తల్లి నీనోట దేవుని వాక్కుపొల్లపోదు అని యేలీయాను కొనియాడింది. ప్రభువే జనన మరణాలకు కర్తకదా! ఈ విధంగా యేలీయా అన్యజాతుల యెదుట యావేకు సాక్ష్యం పలికాడు. అన్యులుకూడ ప్రభుని తెలిసికొని పూజించేలా చేసాడు - 1 రాజు 17.

4. ఏలీయా స్వర్గానికి వెళ్ళడం

ఏలీయా అతని శిష్యుడైన యెలీషా యోర్గాను నది దగ్గరికి వచ్చారు. ఏలీయా నీటిని గొంగళితో కొట్టగా నదిపాయలై దారి యేర్పడింది. ఆ దారిన గురుశిష్యులు ఆవలివొడ్డుకు చేరారు. ఏలీయా నేను ప్రభువు దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను. ఈ చివరి క్షణాల్లో నీకు ఏమి ఉపకారం కావాలో చెప్పు అన్నాడు. ఎలీషా నాకు నీ శక్తిలో రెండు వంతులు దయచేయి అని అడిగాడు. అనగా నన్ను నీ పెద్ద కొడుకులాగ చూడమని భావం. ఏలీయా ఇది కష్టమైన కోర్కె అని చెప్పాడు. అంతలో నిప్పు గుర్రాలు లాగే అగ్నిరథం వారి మధ్యలోకి ప్రవేశించింది. ఏలీయా ఆ రథమెక్కి సుడిగాలిలో మోక్షానికి వెళ్ళిపోయాడు. ఏలీయా శక్తిలో రెండు వంతులు ఎలీషాకు సంక్రమించాయి. అతడు గురువుగారి గొంగళితో యోర్దాను నీటిని కొట్టగా పూర్వపురీతినే దారి యేర్పడింది. ఆ మార్గాన్నే అతడు తిరిగివచ్చాడు. యెలీషాకూడ గురువు మార్గంలోనే నడచి యిస్రాయేలు దేశంలో యావే మతాన్ని నిలబెట్టాడు. గురువుగారిలాగే తానూ అద్భుతాలు చేసి ప్రజలను దేవుని దగ్గరికి రాబట్టాడు - 2 రాజు 2, 1–18.

5. లోకాంతంతో తిరిగి వచ్చేవాడు

ఏలీయా గాథలు అద్భుతాలు ప్రాచీన యూదులను బాగా ఆకట్టుకొన్నాయి. పూర్వవేదంలో యేలియాను గూర్చి రెండు సంగతులు ప్రచారంలో వున్నాయి. 1. అతడు చనిపోకుండానే మోక్షానికి వెళ్ళినవాడు. 2. లోకాంతంలో ప్రభువు న్యాయతీర్పు జరుపకముందు మల్లా భూమిమీదికి దిగివచ్చేవాడు. కనుకనే మలాకీ ప్రవచనం 4,5 పై రెండవ అంశాన్ని గూర్చి ఈలా చెప్తుంది. "ప్రభువు మహాదినం రాకముందే నేను ఏలీయా ప్రవక్తను మీ వద్దకు పంపుతాను. అతడు తండ్రులను కుమారులను ఏకం చేస్తాడు". ఇక్కడ తండ్రులను కుమారులను ఏకం చేయడమంటే కుటుంబాల్లో అంతఃకలహాలు తొలగించి తండ్రులనూ బిడ్డలనూ రాజీపర్చడం. ఏలీయా తిరిగివచ్చి ఈ కార్యం చేసాకగాని ప్రభువు న్యాయతీర్పు తీర్చడు. ఈ యంశాన్నిగూర్చి సీరా జ్ఞానగ్రంథం 48, 10 ఈలా చెప్తుంది.

"నీవు నిర్ణీత సమయాన తిరిగివచ్చి హెచ్చరికలు చేస్తావనీ
దేవునికోపం ప్రజ్వరిల్లక ముందే దాన్ని చల్లారుస్తావనీ
తండ్రులకూ కుమారులకూ రాజీ కుదుర్చుతావనీ
యిప్రాయేలు తెగలను ఉద్ధరిస్తావనీ
లేఖనాలు నుడుపుతున్నాయి."