పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయడానికి కంకణం కట్టుకొంది. అహాబు భార్య ప్రోద్బలంపై సమరియాలో బాలు దేవతకు దేవళాన్ని నిర్మించాడు. ఏలీయా ఈ యిద్దరిని ద్రోహులుగా పరిగణించి ఎదిరించాడు. యెసెబెలు రాణి పోషించే బాలు ప్రవక్తలు 450 మంది వున్నారు. ఏలీయా రాజుని సవాలు చేసాడు. మీరు కొలిచే బాలు నిజమైన దేవుడో లేక మేము కొలిచే యావే నిజమైన దేవుడో తేలిపోవాలి. మీ ప్రవక్తలు ఒక యెద్దును కోసి దాని మాంసాన్ని బలిపీఠంపై పేర్చి మీ బాలు దేవతను నిప్పు పంపమని ప్రార్ధించాలి. అలాగే నేను ఇంకో యెద్దును కోసి దాని మాంసాన్ని మరో బలిపీఠంపై పేర్చి నిప్పు పంపమని మా యావే దేవుని ప్రార్ధిస్తాను. ఏ దేవుడు నిప్పు పంపి మాంసాన్ని దహిస్తాడో అతడే నిజమైన దేవుడు అని చెప్పాడు. ఆ సవాలుని ఉభయపక్షాలు అంగీకరించాయి. జనమంతా కర్మెలు కొండమీద ప్రోగయ్యారు. బాలు ప్రవక్తలు ఎంత ప్రార్థన చేసినా వారి దేవుడు పీఠంమీదికి నిప్పును పంపలేదు. కాని యేలీయా ప్రార్థన చేయగానే యావే నిప్పును పంపి రెండవ పీఠంమీది మాంసాన్ని దహించాడు. పందెంలో యేలీయా గెల్చాడు. అతడు బాలు ప్రవక్తలందరినీ చంపించాడు. యావేకు విజయం, బాలుకు పరాజయం కలిగాయి — 1రాజు 18.

ఏలీయా యావే మతం కొరకు మాత్రమేకాక యావే న్యాయం కొరకుగూడ పోరాడాడు. అతడు పేదవాళ్ళ కోపు తీసికొన్నాడు. అహాబురాజు నాబోతు అనే రైతును అన్యాయంగా చంపించి అతని ద్రాక్షతోటను అపహరించాడు. ప్రభువు అహాబును చీవాట్లు పెట్టడానికి యేలీయాను పంపాడు. ప్రవక్త అతన్ని ఆ ద్రాక్షతోటలోనే కలసికొని నీవు ప్రభువు ఆజ్ఞమీరి దుష్కార్యం చేసావు. కనుక అతడు నిన్ను నాశం చేస్తాడు. నాబోతు నెత్తుటిని శునకాలు నాకిన తావుననే నీ నెత్తుటిని కూడ కుక్కలు నాకుతాయి అని గర్జించాడు. రాజు ప్రవక్త మాటలకు దడిసి పశ్చాత్తాపపడ్డాడు - 1 రాజు 21. ఈ రీతిగా యేలీయా 9వ శతాబ్దంలో యిస్రాయేలు దేశంలో యావే మతాన్నీ ధర్మాన్నీ న్యాయాన్నీ నిలబెట్టాడు.

3. అన్యజాతులకు దేవుణ్ణి తెలియజేసేవాడు

యావే ప్రభువు తమ జాతివాళ్లనే కాపాడతాడు అనుకొన్నారు యూదులు. కాని అతడు అన్యజాతులను గూడ కాపాడేవాడు. ఏలీయా ప్రభువు ఆజ్ఞపై సీదోను దేశంలోని సారెఫతు నగరానికి వెళ్లాడు. అక్కడ అన్యజాతులకు చెందిన ఓ పేద వితంతువును కలసికొన్నాడు. అది కరవు కాలం. ఆమె పుల్లలేరుకొని తన యింట మిగిలివున్నగుప్పెడు పిండితోను చేరెడు నూనెతోను రొట్టె కాల్చుకోబోతుంది. ఏలీయా ఆమెను ముందుగా తనకు రొట్టె కాల్చిపెట్టమన్నాడు. ఆ వితంతువు అలాగే చేయగా ఆమె యింటిలోని పిండీ నూనే తరగిపోకుండా నిల్చాయి. ఆ కరవు కాలమంతా ఆమె, కుమారుడూ, ఏలీయా రోజూ భోజనం చేయగలిగారు. అహాబు పాపాల వలన దేశంమీదికి కరవు వచ్చింది. ఏలీయా దైవభక్తి వలన పేదవారికి కూడు దొరికింది.