పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుస్తావు బందీలను చెరనుండి వెలుపలికి కొనివస్తావు చీకటిలో వున్నవారిని చెరనుండి విడిపిస్తావు".

ఈ గీతంలో ప్రభువు మొదటిసారిగా సేవకుణ్ణి ప్రజలకు పరిచయం జేస్తున్నాడు. అతడు ప్రభువు ఎన్నుకొన్నవాడు. యావే ఆత్మచే నిండినవాడు. యావే మతాన్ని ప్రజలకు తెలియజేసేవాడు. ప్రవక్త.

చరణం1. ప్రభువు ఆమోసు, యిర్మీయా మొదలైన ప్రవక్తలను లాగే ఇతన్ని గూడ ఎన్నుకొన్నాడు. ఇతడు స్వయంగా ప్రవక్త ఇతడంటే యావేకు ఇష్టం. ప్రభువు ఈ సేవకుణ్ణి తన ఆత్మతో నింపాడు. ఈ యాత్మశక్తితోనే ఇతడు ప్రభువు కోరిన రక్షణ కార్యాన్ని సాధిస్తాడు. పూర్వవేదంలో న్యాయాధిపతులు, రాజులు మొదలైన నాయకులంతా ఆత్మచే నిండినవాళ్లే ఈ సేవకుడు జాతులకు, అనగా యూదులకూ అన్యజాతులకూ కూడ యావే న్యాయాన్ని బోధిస్తాడు, ఇక్కడ "న్యాయం" అంటే, యావే మతం, అది ప్రధానంగా ధర్మశాస్త్రంలో వుంది. కనుక సేవకుడు ప్రధానంగా ధర్మశాస్తాన్ని బోధించేవాడు. అతడు ప్రవక్తగా ఈ పని చేస్తాడు.

2. ప్రభువు పారశీక రాజయిన కోరెషు ద్వారా యూదులకు బాబిలోనియా ప్రవాసంనుండి విడుదల దయచేసాడు. ఈ రాజు ఆర్భాటంగా యుద్దాలు చేసాడు. నగరాల్లో కోలాహలం రేపాడు. కాని మన సేవకుడు ఈ రాజులా కాకుండ నెమ్మదిగా పని చేసికొని పోతాడు. మొదట ప్రజలు అతని వనికినే గమనించరు. అతడు స్వీయబలం వలన కాక ప్రభువు శక్తి వలన విజయాన్ని సాధిస్తాడు.

3. నలిగిన రెల్లకాడ, కునికిపాటుపడే దీపం ప్రవాసంలో బాధలు అనుభవించే యూదులకు చిహ్నం. ఆ దీనులను ఆదుకోవడానికి వచ్చినవాడే సేవకుడు. కనుక అతడు వారిని ఓదార్చి వారికి నెమ్మదిగా యావే మతాన్ని బోధిస్తాడు.

4. ప్రవాసంలోని ప్రజలకు మతబోధ చేసి వారికి యావే మీద భక్తి పుట్టించడం తేలికైన పనికాదు. ఐనా సేవకుడు నిరుత్సాహం చెందడు. దేవుని ఆత్మే అతని నడిపించి వత్సాహ పరుస్తుంది. బాబిలోనియా సామ్రాజ్యంలోని ద్వీపాల్లోను దూరప్రాంతాల్లోను వసించేవాళ్ళకూడ వచ్చి అతని బోధలు వింటారు. వీళ్ళు యూదులూ అన్యజాతి ప్రజలూకూడ కావచ్చు. పూర్వం మోషే ధర్మశాస్త్రబోధకుడు. ఇప్పడు సేవకుడు కూడ అదే పని చేస్తాడు.