పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ప్రభువు సృష్టికర్త, సర్వశక్తి సంపన్నుడు. అతడు తన శక్తిని సేవకునికి ఇచ్చి అతనిచే బోధ చేయిస్తాడు.

6. ప్రభువే సేవకుణ్ణి తన పనిమీద పిల్చాడు. పూర్వం ఆదాముకిలాగే అతనికి కూడ ఒక రూపాన్ని ఇచ్చాడు. తన ఆత్మతో అతన్ని బలపరచాడు. ఆ బలంతోనే సేవకుడు బోధ చేస్తాడు. యావే పూర్వం మోషే ద్వారా యిస్రాయేలుతో నిబంధనం చేసికొన్నాడు. కాని యూదులు ఆ ఒడంబడికను మీరారు. కావుననే యిప్పడు బాబిలోనియా ప్రవాసంలో వున్నారు. సేవకుడు వారిని మరల నిబంధనను పాటించేవారినిగా చేయాలి. అతడే స్వయంగా నిబంధనమై వారికి ప్రేరణం పుట్టిస్తాడు. ఆ ప్రజలు నిబంధన నియమాల ప్రకారం జీవించేలా చేస్తాడు. ఇంకా, అన్యజాతి ప్రజలు చీకటిలో మ్రగ్గుతున్నారు. సేవకుడు వీరికి జ్యోతి ఔతాడు. ధర్మశాస్త్ర జ్యోతినే వారిపై ప్రసరింపజేస్తాడు. వాళ్ళు ధర్మశాస్తాన్ని పాటించి, యావే ప్రభువుని పూజించి అతని నుండి రక్షణాన్ని పొందుతారు.

7. సేవకుడు అన్యజాతివారికి వెలుగుగా వుంటాడని పూర్వచరణంలో విన్నాం. ఈ చరణం అతడు వారికి చూపునిస్తాడని చెపుతుంది. ధర్మశాస్త్రబోధ ద్వారానే ఈ చూపు. ఇక, అతడు యూదులను బాబిలోనియా దాస్యమనే చెరనుండి విడిపిస్తాడు. ఆ దాస్యం వారికి చెరా, చీకటీ కూడ. కనుక భక్తుడు వీటినుండి వారికి విముక్తి కలిగిస్తాడు.

సంగ్రహంగా ఈ గీతం చెప్పే భావాలు ఇవి. యావే సేవకుణ్ణి ఎన్నుకొని అతన్ని తన్ను గూర్చి బోధించమని ఆజ్ఞాపించాడు. అతనికి ఆత్మశక్తిని దయచేసాడు. అతడు నెమ్మదిగా, నిదానంగా యూదులకూ అన్యజాతివారికీ గూడ బోధ చేస్తాడు. యూదులకు నిబంధనం, అన్యజాతి ప్రజలకు జ్యోతి ఔతాడు.

ఈ సేవకుడు నూత్న వేదంలోని క్రీస్తేనని చెప్పాం. కనుక ఈ గీతం క్రీస్తు పట్ల నెరవేరిన తీరును పరిశీలిద్దాం. క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో తండ్రి అతనికి సాక్ష్యమిచ్చాడు. అతడు తనకు ప్రియకుమారుడని వాకొన్నాడు మత్త 3, 17. ఈ వాక్యం యెషయా 42,1 నుండే గ్రహింపబడింది. క్రీస్తు పదిమంది దృష్టిని ఆకర్షించకుండా నెమ్మదిగా రోగుల వ్యాధులను నయం చేయడంచూచి మత్తయి అతన్ని సేవకునితో పోల్చాడు - మత్త12, 18–20. యెష 42,8. సేవకుడు యూదులకు నిబంధనమైతే క్రీస్తు కూడ నూత్నవేద ప్రజలకు నిబంధనం - మత్త 26,28. సేవకుడు అన్యజాతులకు వెలుగైతే క్రీస్తు కూడ వెలుగు. సిమియోను చెప్పినట్లుగా అతడు అన్యజాతులకు మార్గ దర్శకమైన వెలుగు - లూకా 2, 32. ఇంకా అతడు లోకానికే వెలుగు - యోహా8, 12. సేవకుళ్లాగే అతడు కూడ గ్రుడ్డివారికి చూపు, చెరలో వున్నవారికి విడుదల దయచేయడానికే వచ్చాడు - లూకా 4, 18. ఈ విధంగా సేవకుణ్ణి గూర్చిన ప్రవచనాలు క్రీస్తునందు పరిపూర్ణమయ్యాయి.