పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూత్నవేదంలో క్రీస్తుకి అన్వయిస్తాయి. సేవకుడు ఇతడే. కనుక ప్రాచీన కాలంనుండి క్రైస్తవ భక్తులు వీటిని భక్తితో మననం చేసికొంటూ వచ్చారు. ఈ క్రింద ఈ నాలు గీతాలమీద వ్యాఖ్య చెప్పి వాటి భావాలను వివరిస్తున్నాం. భక్తులు ఈ ప్రవచనాలను జాగ్రత్తగా మననం చేసికొని దైవానుభూతిని పొందాలి.

మొదటి గీతం 42, 1-7

1. 'ఇదిగో నా సేవకుడు
నే నితన్ని బాలాఢ్యుని జేసాను
ఇతన్ని ఎన్నుకొన్నాను, ఇతనివలన ప్రీతి చెందాను
ఇతన్ని నా యాత్మతో నింపాను
 ఇతడు జాతులకు న్యాయాన్ని కొనివస్తాడు
2. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు
వీధుల్లో ఉపన్యసింపడు
3. నలిగిన రెల్లకాడను త్రుంచివేయడు
కునికిపాటుపడే దీపాన్ని ఆర్చివేయడు
 నమ్మదగినతనంతో ఎల్లరికీ న్యాయాన్ని బోధిస్తాడు
4. నిరాశ జెందక నిరుత్సాహానికి గురికాక
నేలమీద న్యాయాన్ని నెలకొల్పుతాడు
 ద్వీపాలు ఇతని బోధకొరకు ఎదురుచూస్తాయి
 5. దేవుడు ఆకాశాన్ని సృజించి విశాలంగా విప్పాడు
భూమినీ దాని మీద వసించే ప్రాణులనూ చేసాడు
దానిమీది నరులకు ప్రాణమొసగాడు
దానిమీద వసించేవారికి జీవాన్ని దయచేసాడు
 అట్టి దేవుడైన ప్రభువు ఈలా చెప్తున్నాడు
6. ప్రభువునైన నేను నిన్ను పిల్చాను
నీకు బలాన్నొసగి రూపాన్నిచ్చాను
నీవు న్యాయాన్ని నెలకొల్పాలి
నేను నిన్ను ప్రజలకు నిబంధనంగాను
జాతులకు జ్యోతిగాను నియమించాను