పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



8. మెరీబా వద్ద నీళ్లు - సంఖ్యా 20, 1 —11

ఎడారి ప్రయాణంలో యిస్రాయేలు ప్రజలు సీను ఎడారిచేరి మెరిబావద్ద విడిది చేసారు. మిర్యాము చనిపోగా ఆమెను అక్కడనే పాతిపెట్టారు. ఆ తావులో ప్రజలకు నీళ్ళు దొరకలేదు. కనుక వాళ్ళు నాయకులైన మోషే, అహరోనుల మీద తిరగబడ్డారు. ఈజిప్టులో వుండగా మస్తుగా తిన్నాం. ఇక్కడ తిండిలేదు, అసలు నీళ్ళకూడలేవుకదా అని గొణిగారు. దేవునితో వాదాడారు. కనుకనే ఆ ప్రదేశానికి మెరిబా అనిపేరు. ఆపేరుకి వాదాద్దం అనే అర్థం.

మోషే, అహరోనులు సాన్నిధ్యపు గుడారంవద్ద దేవునికి మనవి చేసారు. దేవుడు వారితో మీరు ప్రజలను ఆ యెదుటవున్న బండదగ్గర ప్రోగుజేయండి. ఈకర్రను తీసికొనిపోయి ఆ బండను నీళ్ళీయమని ఆజ్ఞాపించండి. దానినుండి నీళ్ళు పారతాయి అని చెప్పాడు. అది పూర్వం అహరోను వాడిన కర్ర. అలాగే మోషే ప్రజలను బండవద్ద ప్రోగుజేసి కర్రను చేతబట్టుకొని వచ్చాడు. కాని అతనికి అనుమానం కలిగింది. బండను ఆజ్ఞాపించినంత మాత్రాన్నే దానినుండి నీళ్ళేలా వస్తాయి అనుకొన్నాడు. కనుక అతడు ప్రభువు చెప్పకున్నా కర్రతో బండను బాదాడు. అదీ వొకసారికాదు, రెండుసార్లు, ఈ చర్య అతని అవిశ్వాసాన్నీ అవిధేయతను సూచిస్తుంది. అతనికి ప్రభువుశక్తి తెలిసికూడ శంకించాడు.

దేవుడు కరుణించి బండనుండి నీళ్ళు పారించగా ప్రజలు త్రాగారు, కాని దేవుని శక్తిని శంకించినందున ప్రభువు ఆ యన్నదమ్ములను కఠినంగా శిక్షించాడు. మీరు నా పవిత్రశక్తిని నమ్మలేదు కనుక వాగ్టత భూమిలో అడుగు పెట్టలేరు అన్నాడు. కనుక ఆ సోదరులు ఎడారిలోనే కన్నుమూసారు. సామాన్య ప్రజలు శంకించడం ఒక యెత్తు, మోషేలాంటి మహాసేవకుడు దేవుణ్ణి శంకించడం మరోయెత్తు.

బండనుండి పారిన ఈ నీళ్ళ నూత్న వేదంలో పవిత్రాత్మను సూచిస్తాయి. సిలువపై క్రీస్తు ప్రక్కలో నుండి పారిన నీళ్ళనుగూడ సూచిస్తాయి.

ఈ సంఘటనం నుండి నేడు మనం నేర్చుకోవలసిందేమిటి? మన విశ్వాసం లోపించ కూడదు. దేవుని శక్తిని శంకించకూడదు. అతనికి ఏమి అసాధ్యం? మనం ఎంత పెద్ద పదవుల్లో వున్నామో మన విశ్వాసంకూడ అంతపెద్దదిగా వుండాలి. మోషేలాంటి భక్తిపరుడే అవిశ్వాసం వలన శిక్షను తెచ్చుకొన్నాడంటే, మన తరపున మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి? ఎంత విశ్వాసంతో జీవించాలి?