పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



7. మిర్యామునకు శిక్ష సంఖ్యా 12

యిస్రాయేలు ప్రజలు మోషే నాయకత్వాన ఎడారిలో ప్రయాణం చేస్తూ హాసెరోత్తున విడిది చేసారు. అక్కడ అహరోను, మిర్యాము మోషేమీద తిరగబడ్డారు. మోషే అప్పటికే యితియోపీయ స్త్రీని పెండాడాడు. దీన్ని ఆసరాగా పెట్టుకొని వాళ్ళు తమ్మునిమీద తిరగబడ్డారు. దేవుడు నీద్వారానేగాక, మాద్వారాగూడ మాటలాడాడు అన్నారు–2. అనగా మోషేతోపాటు తాముకూడ యిప్రాయేలు సమాజానికి నాయకులమని వారిభావం. సాటిలేని మోషే నాయకత్వాన్ని చూడగా వారికి అసూయ పుట్టింది. కనుకనే వాళ్ళు తమ్ముణ్ణి ఎదిరించారు. ఈ సందర్భంలో బైబులు మోషే మహా వినయవంతుడు అని చెప్తుంది–3. ఇక్కడ "వినయవంతుడు" అంటే దేవునికి సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు అని భావం. దేవుడు అతన్ని తనకు ఇషుడైన సేవకునిగా, కార్యనిర్వాహకునిగాఎన్నుకొన్నాడు.

అన్న అక్క మోషేమీద తిరగబడినందున దేవునికి కోపం వచ్చింది. అతడు ఇతర ప్రవక్తలతో కలలలో, దర్శనాలలో మాట్లాడేవాడు. అనగా పరోక్షంగా వారికి తన సందేశాన్ని తెలిపేవాడు. కాని మోషేతో నేరుగా మాట్లాడేవాడు. మోషే దేవుని రూపాన్ని జూచాడు. అతన్ని దర్శించాడు. ఆలాంటి మహానాయకుణ్ణి, నేనే ఎన్నుకొన్నవాడ్డి, ఎదిరించడానికి మీకు ఎన్నిగుండెలు అని విరుచుకుపడ్డాడు.

మోషేను ఎదిరించినందుకు దేవుడు మిర్యామును శిక్షించాడు. ఆమెకు కుష్ట సోకింది. అహరోను వేడికోలుపై మోషే మిర్యాము తరపున దేవునికి మనవి చేసాడు. ప్రభువు ఆమె కుష్టను తొలగించాడు. కాని మిర్యామును ఏడునాళ్ళ పాటు విడిదినుండి బహిష్కరించారు. వారం తర్వాత మళ్ళా పాలెంలో చేర్చుకొన్నారు.

ఈ సంఘటనం కుటుంబంలోని అంతఃకలహాలవల్ల పుట్టింది. నాయకుల అధికారాన్నీ పెద్దరికాన్నీ జూచి అసూయ పడకూడదని ఈకథ భావం. రోజువారి జీవితంలో మనం, మన పెద్దల పేరుప్రఖ్యాతులను జూచి అసూయ చెందుతాం. వారిని విమర్శిస్తూ, చులకన చేసూ మాటలాడతాం. వారికంటె మనం అధికుల మన్నట్లుగా నోరు పారవేసికొంటాం. పల్లవిరుపు మాటలంటాం, ఈలా చేయకూడదు, పెద్దలు దేవునిఅధికారంలో పాలుపంచుకొంటారు. కనుక వారిపట్ల మనకు గౌరవం, వినయం వుండాలి.