పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ కథనుండి మనం నేర్చుకోవలసిన సంఘటనం ఒకటుంది. రాణి రాజుతో మాట్లాడుతూ నేను మాదేశంలో వుండగానే నీ సంపదలను గూర్చీ జ్ఞానాన్ని గూర్చీ విన్నాను. ఇప్పడు ఇక్కడికి వచ్చి వాటిని స్వయంగా నా కన్నులతో చూచి ఆనందించాను. ఐనను నా సేవకులు నీ గొప్పతనంలో సగమైన నాకు తెలుపలేదు. నీ విజ్ఞాన వైభవాలు నేను విన్నదాని కంటె ఎక్కువగా వున్నాయి అంది. సేవకులు రాణికి సాలోమోనును గూర్చి తక్కువగా జెప్పారు. నేడు మనమో మనలను గూర్చి ఎక్కువగా చెప్పకుంటాం. ఎక్కువచేసి తక్కువగా చెప్పకోవడం ఉత్తముల పద్ధతి. తక్కువచేసి ఎక్కువగా చెప్పకోవడం నీచుల పద్ధతి.

6. ఉజ్జీయా పతనం - 2 రాజుల దినచర్య 26

ఉజ్జీయా యూదా రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో వొకడు. అతడు క్రీస్తుపూర్వం 783 నుండి 742 వరకు, అనగా 52 ఏండ్లు యెరూషలేము నుండి పరిపాలనం చేసాడు. ఆ రాజు పెద్ద సైన్యాన్ని పోషించి ఫిలిస్త్రీయులను, అరబ్బీయులను జయించాడు. ఎడారిలో కోటలు కట్టించాడు.యెరుషలేములో ద్వారాలు, బురుజులు నిర్మించి నగరాన్ని సురక్షితం చేసాడు. బావులు త్రవ్వించి వ్యవసాయాన్ని వృద్ధి చేసాడు. యాజకుడు జెకర్యా అతనికి సలహా లిచ్చినంతకాలం అతడు దైవభక్తితో జీవించి దేవుని ఆశీస్సులు పొందాడు. చాలసంపదలు కూడబెట్టాడు.

కాని జెకర్యా గతించాక అతనికి తల తిరిగింది. అతడు అహంకారంతో దేవళం లోనికివెళ్ళి దేవునికి పీఠంమీద సాంబ్రాణిపాగ వేయబోయాడు. ఇది యాజకులు చేయవలసిన పని. కనుక తొమ్మిదిమంది యాజకులు అతనికి అడ్డువచ్చారు. నీవు ప్రభువును ధిక్కరించి అతని అనుగ్రహాన్ని కోల్పోయావు అని చెప్పారు. వెంటనే అతని నొసటిమీద కుష్ట పొక్కులు లేచాయి. అది దైవశిక్ష యాజకులు అతన్ని దేవళం నుండి వెలువలికి గెంటివేసారు. ఆ రాజు చనిపోయిందాకా కుష్టరోగిగా వుండిపోయాడు. మళ్లా దేవళంలో అడుగు పెట్టలేకపోయాడు. ఒక ప్రత్యేక భవనంలో వసించాడు. రాజ్య కార్యాలను అతని కుమారుడు పరిశీలించాడు.

ఉజ్జీయారాజును చూచి మనం పాఠం నేర్చుకోవాలి. పొగరు తగదు. కొన్నిసార్లు దైవాశీర్వాదంతో వృద్ధిలోకి వస్తాం. అంతమాత్రం చేతనే మిడిసిపడకూడదు. మన తాహతుకుమించిన కార్యాలు చేపట్టకూడదు. పొగరు వల్ల చాలమంది మన్నుగరచారు. మనకు వినయం ఒక్కటి తగుతుంది.