పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ సంఘటనం 2 సమూవేలు 15, 19-21 లో వస్తుంది. దావీదు కొడుకు అబ్సాలోము తండ్రిమీద తిరగబడ్డాడు. దావీదు అతనికి దడిసి నగరాన్ని విడచి పారిపోతున్నాడు. కొద్దిమంది స్వామిభక్తిగల సేవకులు మాత్రం అతనితో వెళుతున్నారు. అన్యజాతి వాడయిన ఇత్తయి కూడ రాజుతో పోతున్నాడు. దావీదు ఇత్తయిని తనవెంట రావద్దని హెచ్చరించాడు. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎన్ని కష్టాలు పడాలో నాకే తెలియదు. నీవు పరదేశివి. ఇటీవలే నా కొలువులో చేరావు. ఇప్పడు నాతో నీవు కూడ కష్టాలు అనుభవించడమెందుకు? తిరిగిపోయి కొత్తరాజయిన అబాలోము కొలువులోజేరి సుఖంగా వుండు అని సలహా యిచ్చాడు. కాని యిత్తయి దావీదు మాటలు వినలేదు. చావయినా బ్రతుకయినా నేను నీతోనే వస్తాను. నా ప్రభువు ఎక్కడ వుంటాడో నేనూ అక్కడే వుంటాను అన్నాడు. ఆ అన్యజాతివాని నమ్మదగిన తనం అంతగొప్పది. ఓవైపు దావీదు సాంత కొడుకే తండ్రికి ద్రోహం చేస్తూంటే, మరోవైపు అన్యజాతి బంటు ఒకడు రాజుకి సేవలు చేస్తున్నాడు. విశ్వసనీయత ఈలా వుండాలి కదా! అన్యజాతి స్త్రీ రూతు, అత్తనవోమిపట్ల చూపిన విశ్వసనీయత కూడ ఈలాంటిదే - రూతు 1, 17. దేవునిపట్లగాని, ఉపకారం చేసినవారి పట్లగాని మనంకూడ ఈలాంటి నమ్మదగినతనాన్ని చూపాలి.

5. పెబారాణి - 1 రాజతి 10, 1-1 3

షెబారాణి సొలోమోను వైభవాన్ని గూర్చి వింది. ఆమె స్వయంగా అతన్ని సందర్శించడానికి ఆఫ్రికా నుండి వచ్చింది. ఆమె అతన్ని చాల ప్రశ్నలు అడిగింది. వాటన్నిటికి అతడు సులువుగానే జవాబులు చెప్పాడు. ఆ రాజు విజ్ఞానానికి ఆమె ఆశ్చర్యపడింది. ఆమె సొలోమోనుతో కొన్ని వ్యాపారపు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రచయిత సాలోమోను సిరిసంపదలను వర్ణించాడు. సొలోమోను భవనాలు, అతని ఉద్యోగులు, అతని దహనబలులు మొదలైనవన్నీ పరికించేటప్పటికి ఆమెకు నోటమాట రాలేదు.

రాణి సొలోమోను విజ్ఞానమూ సిరిసంపదలూ రెండిటిని మెచ్చుకొంది. అతడు కొలిచే యావే ప్రభువును స్తుతించింది. ఆ దేవుడు యిస్రాయేలును ప్రేమించి వారికి సాలోమోనులాంటి మహారాజుని దయచేసాడు అని పల్కింది. తాను పూర్వం తనదేశంలో విన్నదానికంటె గూడ సాలోమోను విజ్ఞానం వైభవం అధికంగావున్నాయని వాకొంది–7. ఆమె రాజుకి బంగారం, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు కానుకగా ఇచ్చింది. అతడు కూడ తన రాజవైభవానికి తగినట్లుగా ఆమెకు కానుకలిచ్చాడు.