పుట:Bhoojaraajiiyamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజరాజీయము ఆశ్వా. 1


వ.

కావున నీ కొక్కయుపాయంబు చెప్పెద, సకలజనవిధేయుం డగు నారాయణ
దేవుండు దత్తాత్రేయుం డను నామధేయంబుతో హేమకూటశైలంబున నున్న
వాఁ డందుఁ జనిన నీ కోర్కి సఫలం బగు, నయ్యోగీశ్వరేశ్వరుండును మనుష్యు
లకు దృష్టిగోచరుందు గాఁ డతనిఁ గనుటకై యొక్కమంత్రంబు చెప్పెద నది
యనుష్టించునప్పుడు గౌతమియంచు దర్శనస్పర్శనాదుల వర్జింపవలయు నట్లు
చేయనినాఁ డీమంత్రంబు పని చేయ దని చెప్పి యెప్పుడు నతండ తన్ను
దడవకుండునట్టి వైరాగ్యంబు పుట్టించి యొకమంత్రం బుపదేశించి యతని
మరలించి గౌతమి యథేచ్చం జనియె నది యట్ల కాదె.

103


క.

ఉత్తము లాశ్రితులం గృపా
యత్తతఁ జేపట్టి ప్రోతు, రటు గాకున్నన్
రిత్త చనఁ జేయ రొండు ని
మిత్తంబున నైన బ్రతుకు మెయికొనఁ జేర్తుర్.

104


వ.

అట్లు గౌతమిచేత నివర్తితుం డయి పోయి హేమకూటముం గాంచి రోగ
వేదనం డిగ్గఁద్రావుచు.

105


ఆ.

అట్లు చేరి యాతఁ డాపర్వతాగ్రంటు
నందు నొక్క రమ్యమైనచోట
వివులనిష్ఠతోడఁ దప మాచరింపంగ
మెచ్చి దివ్యవేష మచ్చుపడఁగ.

106


వ.

దత్తాత్రేయుండు దరిసెనం బిచ్చిన మహుండు.

107


ఉ.

అత్రిమహామునీశ్వరు తపోవనిజాత లసత్ఫలంబుఁ దే
వత్రయమాతగాఁగఁ జెలువం బగు నయ్యనసూయనెయ్యపుం
బుత్రుఁడు తోయజాతభవభూతగణేశులతోడఁబుట్టు దాఁ
జిత్రవరితుఁ డంచు నినుఁ జెప్పుదు రార్యులు యోగిపుంగవా!

108


వ.

అని బహుప్రకారంబులఁ బ్రస్తుతించునతని వాగ్జాలంబునకుఁ జాల రంజిల్లి
యమ్మునీశ్వరుండు 'ఓరీ! నీవు నా కందువ యె ట్లెఱింగి' తనిన నతఁడు
భయభక్తిసంభ్రమంబులు ముప్పిరిగొనుచుండఁ బ్రణామంబుఁ జేసి 'దేవా!
యవధరింపు' మని యి ట్లనియె.

109