పుట:Bhoojaraajiiyamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోజరాజీయము ఆశ్వా 1


క.

మనమునఁ దలపోయుచు నటు
గను మోడ్చినవేళ యొక్క ఘనతరతేజో
ధనుఁ డస్మత్స్వప్నంబున
ననుకంపాయత్తచిత్తుఁ డై పొడచూపెన్.

60


సీ.

ఆభవ్యుఁ డఖిలచరాచరాంతర్గతుం
       డైనయాదిమవిష్ణుఁ డని యెఱింగి
యాదేవు దివ్యభవ్యావతారంబుల
       నిట్టి యద్భుతమూర్తి యెద్ది యొక్కొ
యని చూచుచో మందహాసచంద్రిక గల్గు
       సింహవక్త్రంబునఁ జెలువమైన
మనుజదేహంబును మహితాంకతలమున
       నక్షీణసంపత్కటాక్షరుచులఁ


తే.

దనరుకాంతయును, సుధాధామరుగ్ధామ
సమము లైన శంఖచక్రములును,
దివ్యమాల్యములును, దివ్యాంబరంబులు
దివ్యభూషణములు దేజరిల్ల.

61


క.

ఆమూర్తికి నీమూర్తికి
నేమి విభేదం బనంగ నింపగు రూప
శ్రీమహిమఁ దనరి మద్గురుఁ
డామూర్తిన కదిసి యుండి యాదర మెసఁగన్.

62


ఆ.

'ఇందు రమ్ము వత్స యేను నీమీఁది కృ
పాతిశయముపేర్మి నరుగుదెంచి
నాఁడ' నమచుఁ బిలిచి నన్నాదరించి ప్ర
హర్షవార్ధి నోలలార్చి యపుడు.

63


చ.

అదె జగదేకవంద్యుఁ డగు నాదినృసింహుని దివ్యరూపసం
పదఁ గనుఁగొంటి సర్వసులభంబుగ; నీకృతిలక్ష్మికి న్వరుం
డొదవె, ఫలించె నీతలఁపు, యోగ్యుఁడవైతి, యశోవిభూతి క
య్యుదధివరేణ్యుచాడ్పున మహోన్నతజీవనవైభవంబునన్.

64