పుట:Bhoojaraajiiyamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

భోజరాజీయము ఆశ్వా 6


క.

'నీతోడఁ జచ్చి క్రమ్మఱ
నీతో జన్మించి పిదప నీవు పెనుపఁగా
నీతనయుఁడ నై పెరుగుట
నోతరుణి! త్రిశాపముక్తి నొందితి నంటిన్.'

110


క.

అని చెప్పుచు నెట కేనియుఁ
జన నుద్యోగించురాజసత్తముఁ గని య
వ్వనిత మది బెదరు గదుర న
తని కి ట్లను మోమునందు దైన్యము దోఁపన్.

111


క.

'ఝషగర్భంబునఁ బొడమిన
ఝషకేతునిఁ గాంచి సంతసము నొందినయా
ఝషకేతువనితఁ బోలితి
ఝష కేతుసమాన! చూడు సత్కృప నన్నున్.'

112


వ.

అని తొల్లి మన్మథుండు నిటలనేత్రునేత్రవహ్నివలన సమసిననాఁడు శరమా
యాడంబరుండగు శంబరుం డంబరమార్గంబునఁ బఱతెంచి తత్సతియగు రతి
నతిత్వరితగతి నెత్తుకొనిపోయి యంతఃపురంబున వైచుకొనిన నది మాయావతి
యను పేఱం దత్సంగతం బొక్కటియు వెలిగాఁ దక్కటిపను లన్నియుఁ దాన
యనుసంధించుచు, స్వసంకల్పకల్పితయు స్వమూర్తిసదృఢయు నగునొక్క
కృతకవనిత నతనికోర్కి దీర్ప నప్ప టప్పటికి నియోగించుచుఁ దన పాతి
వ్రత్యంబునకు హాని లేకుండ నిట్టు చరించుచుండఁ బెద్దకాలంబునకు ద్వాప
రాంతంబున నఖిలభువనావనగుణభ్రాజిష్ణుండగు విష్ణుండు కృష్ణుండై పుట్టిన
నప్పుణ్యమూర్తికి రుక్మిణిదేవికిఁ గాముండు ప్రద్యుమ్నుండై పుట్టుట శంబరుం
డెఱింగి యాశిశువుం గొని పోయి సముద్రమధ్యంబున వైవ నొక్కమీను
మ్రింగె, నది యొక్క వేఁటకానిచేతం దగులు వడి యాశంబరునకు వాఁడు
కానుకగాఁ దెచ్చి యొప్పింప మాయావతిచేతం దఱుగంబడునప్పుడు శుక్తి
మధ్యంబునం బొల్చు ముక్తాఫలంబునుం బోలె నాఝషజఠరకుహరంబున
నున్న బాలునిం గని యతని గూఢవృత్తి నెత్తుకొని పోయి యద్దేవి రహస్య
ప్రదేశంబున నునిచి పెనుచుచుండ నతండు సంప్రాప్తయౌవనుండై శంబరు
వధియించి శంబరారి యను పేర నిజసతీయోగసౌఖ్యంబు లనుభవించుచుండుటఁ
జెప్పు నప్పురాతనకథారూపంబు దీపింప నాడిన నతం డి ట్లనియె.

113